టీఆర్ఎస్ ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ

Update: 2021-11-12 09:30 GMT
ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతోంది. నిజానికి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కు ధర్నాలు, ఆందోళనలు కొత్త కాదు. నిత్యం పోరాటాలతోనే తెలంగాణను సాధించిన పార్టీ టీఆర్ఎస్.

అలాంటిది ప్రభుత్వంలోకి వచ్చాక ఆ పార్టీ ప్రత్యేకంగా ఉద్యమించాల్సిన అవసరం రాలేదు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత నేపథ్యంలో ఇంత కాలం టీఆర్ఎస్ కు ఉద్యమించాల్సిన అవసరం రాలేదు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా.. నిత్యవసరాల ధరలు మండిపోతున్నా.. సాగు చట్టాల పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ మౌనంగానే సమర్థిస్తూ వచ్చింది. ఎప్పుడో తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో.. ఏపీలో పోలవరం ముంపు మండలాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. ఆ తర్వాత అడపాదడపా విమర్శలే కానీ.. రోడ్డెక్కి ఉద్యమించింది లేదు. ఇప్పడు మాత్రం నేరుగానే ఢీకొంటోంది. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలతో అధికార పార్టీ తమ ఉద్దేశాన్ని గట్టిగా చాటిచెబుతోంది.

మారిన రాజకీయ పరిణామాలతో..

2019 లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోవడం, బీజేపీ పుంజుకోవడంతో రాజకీయాలు వేడెక్కాయి.

దీనికితోడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బీజేపీలో దూకుడు పెరిగింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో విజయాలు.. తాజాగా హుజూరాబాద్ లో గెలుపు ఆ పార్టీకి ఊపునిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ మేల్కొనక తప్పలేదు. ఆ క్రమంలోనే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు. దీనికోసం ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఓ సాధనంగా ఎంచుకున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు తాము నిషేధించిన హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ఉన్న ధర్నా చౌక్ లోనే ఆందోళనకు దిగారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరి ధాన్యం కొనాల్సింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు.

ఇది ట్రైలర్ మాత్రమే బీజేపీకి ఇక సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ‘‘మేము తలుచుకుంటే మీ పీఠం కదిలిస్తాం...మేము బరితెగిస్తే మీరు ఉంటారా? ... తెలంగాణ రైతాంగం తలుచుకుంటే బీజేపీ ప్రభుత్వం కూలుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ధర్నా చేయడానికి కనీసం జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. అలాగే ధర్నాచౌక్‌ను తాము ఎత్తి వేయలేదని స్పష్టం చేశారు.

ధర్నా చౌక్ వల్ల ఇబ్బంది అవుతుందని స్థానికులే కోరారని మంత్రి తలసాని వివరించారు. సిద్దిపేటలో జరిగిన ధర్నాలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పోరాటం ఇప్పుడే మొదలైంది.. ఇది ఆరంభమే.. మున్ముందు మరింత ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. ‘రైతులు జర బాగుపడుతుంటే కేంద్రం యాసంగిలో వడ్లు కొనమంటున్నారు.

యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లు పండుతాయి.. అవి బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయి. పంజాబ్‌లో మొత్తం వడ్లు మొత్తం ఎలా కొంటారు..?.. తెలంగాణలో ఎందుకు కొనరు..?’’ అని నిలదీశారు. ‘‘ఆంధ్రలో సీఎం జగన్.. కేంద్ర సర్కారు నిబంధనలు అనుసరించి బాయిల కడా మీటర్లు పెట్టిండ్లు. ఒకప్పుడు దేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదం ఉండేది.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నై కిసాన్ అంటున్నది.

దేశంలో వడ్లు కొనాల్సిన భాద్యత కేంద్రానిదే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారి వడ్లు కొనబోమని చెప్పిన ఘనత బీజేపీదే. ‘ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే.. రైతుల కోపాగ్నికి కమలం వాడిపోక తప్పదు. ప్రశ్నించే రైతులపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని అనడం దేశభక్తా..?’ అని కేంద్రంపై తీవ్రస్థాయిలోహరీష్ మండిపడ్డారు. వడ్లు కొనాలని రైతులు.. ప్రధాని మోదీకి ట్వీట్లు చేయాలి’’అని పిలుపునిచ్చారు.
Tags:    

Similar News