అసెంబ్లీ ర‌ద్దు వేళ‌.. మండ‌లి మీటింగ్ ఎందుకు?

Update: 2018-09-27 05:46 GMT
ఈ రోజు (గురువారం) తెలంగాణ శాస‌న‌మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీ ర‌ద్దు అయిన త‌ర్వాత మండ‌లి స‌మావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?  ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో స‌భ‌కు కేసీఆర్ హాజ‌రు కావొచ్చా?  స‌భ‌ను ఎందుకు పెడుతున్నారు?  స‌భ‌లో ఏ అంశాల్ని ప్ర‌స్తావిస్తారు?  అస‌లు ఇలా గ‌తంలో ఎప్పుడైనా జ‌రిగిందా? లాంటి ప్ర‌శ్న‌లు ప‌లువురికి వ‌స్తున్నాయి.

అసెంబ్లీ ర‌ద్దు అయిన త‌ర్వాత శాస‌న‌మండ‌లి స‌మావేశాలు జ‌ర‌గ‌కూడ‌ద‌న్న రూల్ ఏమీ లేదు. కాకుంటే.. అసెంబ్లీ ర‌ద్దు అయిన‌ప్ప‌టికీ రూల్స్ ప్ర‌కారం ఆర్నెల్ల లోపు మండ‌లి స‌మావేశాలు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. నిబంధ‌న‌ల  మేర‌కు మాత్ర‌మే తాజాగా స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. అందుకే ఈ రోజు స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి ఈ స‌మావేశాల్ని రెండు రోజులు నిర్వ‌హించాల‌ని భావించినా.. ఒక్క రోజుకు కుదించారు.

మండ‌లి చివ‌రి స‌మావేశం మార్చి 29న జ‌రిగింది. రూల్ ప్ర‌కారం చూస్తే.. ఆర్నెల్ల వ్య‌వ‌ధిలోపు మండ‌లిని కొలువు తీర్చాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఈ రోజు స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. దేశ వ్యాప్తంగా శాస‌న మండ‌ళ్లు ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అయితే.. గ‌తంలో అసెంబ్లీ ర‌ద్దు అయ్యాక మండ‌లి స‌మావేశాన్ని నిర్వ‌హించింది లేదు. ఒక ర‌కంగా చూస్తే.. ఇది తొలిసారి అని చెప్ప‌క త‌ప్ప‌దు.

రాజ్య‌స‌భ మాదిరే శాస‌న మండ‌లి కూడా శాశ్విత స‌భ‌. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆర్నెల్ల‌కు ఒక‌సారి త‌ప్ప‌నిస‌రిగా స‌మావేశం కావాల్సి ఉన్నందున‌.. తాజాగా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో రాజ్య‌స‌భ విష‌యంలోనూ అలానే జ‌రిగింది. 1977లో అప్ప‌టి రాష్ట్రప‌తి ఫ‌క్రుద్దీన్ అలీ అహ్మ‌ద్ మ‌ర‌ణించిన‌ప్పుడు.. 1991లోరాజీవ్ గాంధీ మ‌ర‌ణం నేప‌థ్యంలో లోక్ స‌భ ర‌ద్దు అయ్యాయి. రూల్ ప్ర‌కారం రాజ్య‌స‌భ‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితే తెలంగాణ‌లోనూ చోటు చేసుకుంది.

గ‌తంలో లోక్ స‌భ ర‌ద్దు అయ్యాక కూడా రాజ్య‌స‌భ‌ను నిర్వ‌హించిన‌ట్లే తాజాగా తెలంగాణ శాస‌న మండ‌లిని నిర్వ‌హించ‌నున్నారు.  ఈ రోజు ఉద‌యం11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే శాస‌న‌మండ‌లి స‌మావేశం.. మ‌ధ్యాహ్నం నాటికి ముగించ‌నున్నారు. స‌మావేశం ప్రారంభం కాగానే.. దివంగ‌త మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్.. లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ సోమ‌నాథ్‌.. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి.. మండ‌లి మాజీ స‌భ్యులు నేరెళ్ల వేణుమాధ‌వ్‌.. కేర‌ళ వ‌ర‌ద‌లు.. కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారికి సంతాపంగా తీర్మానాల‌ను ప్ర‌వేశ పెడ‌తారు.

వాటిని చ‌ర్చింది ఆమోదిస్తారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రైతు రుణ విముక్తి క‌మిష‌న్ ముసాయిదా బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ పెట్టి చ‌ర్చించి.. అనంత‌రం స‌భను వాయిదా వేస్తారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో నిర్వ‌హిస్తున్న ఈ మండ‌లి స‌మావేశం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News