ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌కి జైల్లో నిరాహారదీక్ష..?

Update: 2015-04-15 05:55 GMT
భరించేవాడు ఉండాలే కానీ.. ప్రతి అడ్డమైనోడు బ్రేక్‌డ్యాన్స్‌ వేసేస్తాడంటే ఏమో అనుకుంటాం కానీ.. తాజా ఘటనను చూస్తే మాత్రం ఔరా అనిపించక మానదు. తీవ్రమైన ఆరోపణలతో పోలీసుల అదుపులోకి తీసుకునే ఉగ్రవాదులకు శిక్షలు పడటం ఎప్పటికో కానీ సాధ్యం కాదు. ఒకవేళ శిక్షలు ఖరారు అయ్యాక కూడా వాటిని అమలు చేసే విషయంలో ఎంత ఆలస్యం అవుతుందో తెలిసిందే.

ముంబయి మహానగరాన్ని అల్లకల్లోలం సృష్టించిన కసబ్‌ లాంటి మానవమృగాన్ని ఏళ్లకు ఏళ్లు శిక్ష అమలు చేయకుండా ఉండటం తెలిసిందే. చిత్రమైన విషయం ఏమిటంటే.. దేశంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తికి న్యాయస్థానం విధించిన శిక్షను అమలు చేయటానికి జరిగిన ఆలస్యానికి ఈ దేశ పౌరులే పన్నుల రూపంలో చెల్లించిన మొత్తంతో అతన్ని కొంతకాలం పోషించారు.

ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలతో జైలుకు వెళ్లే వారు.. ఆరోపణలు నిజమై దోషులుగా ఉండే వారు సైతం వ్యవస్థ మీద నిరసన వ్యక్తం చేయటం చిత్రంగానే ఉంటుంది. ఉగ్రవాదుల విషయంలో వివిధ రాజకీయ పార్టీలు వ్యవహరించే ఉదార ధోరణితో పాటు.. ఉగ్రవాదులకు మద్ధతు ఇచ్చే వారి పుణ్యమా అని వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం తాజాగా కలకలం రేపుతోంది.

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన వికారుద్దీన్‌ గ్యాంగ్‌ మృతికి నిరసనగా చంచల్‌గూడ జైల్లో  ఇస్లామిక్‌ ఉగ్రవాదులు నిరాహార దీక్ష చేస్తున్నారు. జైలు అధికారులకు రాతపూర్వకంగా నోటీసు ఇచ్చి మరీ నిరహార దీక్షకు దిగటం గమనార్హం.

జైల్లో ఉన్న వారికి ఏదైనా అయితే.. అదంతా జైలు అధికారుల కారణంగానే అంటూ కొన్ని రాజకీయ పార్టీలు విరుచుకుపడే అవకాశం ఉండటంతో జైలు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి ప్రజల్ని వణికించిన ఉగ్రవాదులు.. జైల్లో సైతం అధికారులకు ముచ్చమటలు పోయిస్తున్నారు. ఉగ్రవాదుల లాంటి వారు సైతం అనవసరమైన విషయాలకు దీక్ష దిగటం దేనికి నిదర్శనం..?

Tags:    

Similar News