తెలంగాణకు మూడు అవార్డులు

Update: 2016-07-31 05:20 GMT
కొత్త రాష్ట్రమే అయినప్పటికీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తనదైన గుర్తింపును చాటి చెబుతోంది. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పలు పోటీల్లో తన సత్తాను చాటి చెబుతోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన జాతీయ పర్యాటక పురస్కారాలు 2014-15 విభాగంలో మూడు అవార్డులు తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకోవటం గమనార్హం.

అత్యుత్తమ వారసత్వ నగరంగా వరంగల్ అవార్డును సొంతం చేసుకుంటే.. బెస్ట్ టూరిజం పబ్లిసిటీ ప్రమోషన్ మెటీరియల్ విభాగంలోనూ అవార్డును సాధించింది. ఈ రెండింటితో పాటు.. తెలంగాణలోని పురాతన దేవాలయాలకు అవార్డుకు ఎంపికైంది. ఒక ఏడాదిలో పర్యాటక రంగానికి సంబంధించి ఎంపిక చేసిన పురస్కారాల్లో మూడు అవార్డుల్ని తెలంగాణ సర్కారు సొంతం చేసుకోవటం గమనార్హం.

ఇక ఇతర విభాగాల విషయానికి వస్తే..  సమగ్ర పర్యాటకాభివృద్ధిలో మధ్యప్రదేశ్ అవార్డు సొంతం చేసుకోగా.. ఈ విభాగంలో గుజరాత్.. కర్ణాటకలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక.. అత్యుత్తమ పర్యాటకహిత రైల్వేస్టేషన్ గా రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ రైల్వేస్టేషన్ పురస్కారం పొందగా.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తమ ఎయిర్ పోర్ట్ అవార్డును దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. పర్యాటక రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా తెలంగాణ సర్కారు కార్యక్రమాల్ని సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశాన్ని చెబుతున్నారు. రానున్న ఐదేళ్లలో‘‘భారతదేశాన్ని ఒక నగరంలా చూడాలంటే హైదరాబాద్‌ మహానగరాన్ని..రాష్ట్రంగా చూడాలంటే తెలంగాణకు రండి’’ అనే నినాదంతో పనిచేస్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ ఆ నినాదాన్ని బలంగా తీసుకెళ్లగలిగితే పర్యాటకంగా తెలంగాణకు భారీ లబ్థి చేకూరుతుందనటంలో సందేహం లేదు. 
Tags:    

Similar News