తెలంగాణ టీడీపీ...ఆట‌లో అర‌టిపండు

Update: 2018-07-19 18:01 GMT
తెలంగాణ టీడీపీ....ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన అనంత‌రం ఉనికి కోసం పోరాడుతున్న ఓ శాఖ‌! ఒక‌ప్పుడు చెర‌గ‌ని ముద్ర‌వేసిన ఈ పార్టీ ఇప్పుడు క‌కావిక‌లం అయి..క‌నుమ‌రుగు ద‌శ‌కు చేరుకుంద‌నే టాక్ ఉంది. అయితే, త‌మ‌కు తోచిన అంశాల‌పై ఉన్న అతికొద్దిమంది నాయ‌కుల‌తో అడ‌పాద‌డ‌పా హ‌డావుడి చేస్తోంది, `మీడియాలో` నిలుస్తోంది. అయితే ఆ పార్టీ తాజాగా కొత్త సంద‌డి మొద‌లుపెట్టేందుకు సిద్ధ‌మైంది. అదే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కొత్త‌గా టార్గెట్ చేయ‌డం. ఇందుకు ఢిల్లీ వేదిక‌గా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకోవ‌డం. అయితే టీటీడీపీ తీరు ఆట‌లో అర‌టిపండు వ‌లే ఉందంటున్నారు ప‌లువురు.

ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా బుధవారం జీరో అవర్‌లో స్పీకర్‌కు ఈ అవిశ్వాస తీర్మానాన్ని అందజేసింది. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అందజేసిన అవిశ్వాస తీర్మానాన్ని ఎంపిక చేసినట్లు స్పీకర్ బీఏసీ సమావేశంలో ప్రకటించారు. త‌ద్వారా నరేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను శుక్ర‌వారం ఎదుర్కోనుంది. త‌మ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్న ఈ క్ర‌మంలో ప‌లు పార్టీల‌ను క‌లిసింది. అదే రీతిలో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని కూడా క‌లిసింది. మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి సార‌థ్యంలోని బృందం టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత కేశ‌వ‌రావుతో భేటీ అయ్యారు. తమ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు కోరారు. అయితే, కేకే హామీ ఇవ్వ‌లేదు. అనంత‌రం మాజీ ఫ్లోర్‌లీడ‌ర్‌, ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ అవిశ్వాసానికి టీఆర్ఎస్ మ‌ద్ద‌తివ్వ‌బోద‌న్నారు.

ఇలా టీఆర్ఎస్ ఓ వైపు మొహం మీదే చెప్పిన‌ప్ప‌టికీ తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు ఇంకా కేసీఆర్‌పై ఆశ చావ‌న‌ట్లుంది. అందుకే మ‌రోమారు ఆ పార్టీ మ‌ద్ద‌తుకోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది తెలంగాణ టీడీపీ నేత‌లు. పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్. రమణ, సీనియ‌ర్ నేత‌లు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు, వీరేందర్ గౌడ్ శుక్ర‌వారం ఉదయం హైదరాబాద్ నుంచి హస్తినకు బయలుదేరనున్నారు. వీరు ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీల‌ను క‌లిసి మ‌ద్ద‌తుకోరుతారట‌. ఇప్ప‌టికే కేసీఆర్ త‌మ పార్టీ స్టాండేంటో..సిట్టింగ్ ఎంపీల‌కే చెప్పిన క్ర‌మంలో..ఒక్క‌రైనా ప్ర‌జా ప్ర‌తినిధిలేని ఈ బృందం...టీఆర్ఎస్ నాయ‌కుల‌తో స‌మావేశం అవ‌డం వ‌ల్ల సాధించేది ఏంటో వారికే తెలియాలి. ఈ నేత‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆట‌లో అర‌టిపండు వంటిది కాకుండా మ‌రేంట‌ని ప‌లువురు బ‌హిరంగంగానే చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News