వెలిసిపోతున్న పసుపు జెండా..!

Update: 2021-07-17 14:30 GMT
తెలుగుదేశం పార్టీ పూర్తిగా సంధికాలంలో ఉంది. షాకుల మీద షాకులు త‌గులుతూనే ఉన్నాయి. తిరిగి బ‌లం కూడ‌గ‌ట్టుకుందామ‌ని అధినేత ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌క‌పోగా.. ఎదురు దెబ్బ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. ఈ దెబ్బ‌లు కూడా రెండువైపులా బాధిస్తుండ‌డంతో చంద్ర‌బాబు ఊపిరి పీల్చుకోలేక‌పోతున్నారు. ఓ వైపు అధికార ప‌క్షం నుంచి దాడి జ‌రుగుతుండ‌గా.. మ‌రోవైపు సొంత పార్టీ నుంచి క‌ష్టాలు ఎక్కువ‌వుతున్నాయి. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ప్ర‌తిసారీ కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతూనే ఉంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌గిలిన భారీ దెబ్బ నుంచి కోలుకోవ‌డానికి చంద్ర‌బాబుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో, ఆ త‌ర్వాత మునిసిప‌ల్ పోరులోనూ సైకిల్ పంక్ఛ‌ర్ అయిపోయింది. పంచాయ‌తీల్లో 85 శాతానికిపైగా, మునిసిపాలిటీల్లో 90 శాతానికిపైగా స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ.. తిరుగులేని ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. ఆ విధంగా జ‌గ‌న్ త‌న‌కు తిరుగులేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. జ‌నం త‌మ ప‌క్షాన్నే ఉన్నార‌ని చాటుకుంటున్నారు.

దీంతో.. వైసీపీని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక స‌త‌మ‌తం అవుతున్న చంద్ర‌బాబుకు.. ఇంటి లొల్లి ఎక్కువైపోయింది. ఓవైపేమో ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. లోకేష్ ను భావినేత‌గా గుర్తించ‌ట్లేదు పార్టీలోని చాలా మంది. మ‌రోవైపేమో చంద్ర‌బాబు సీనియ‌ర్ సిటిజ‌న్ అయిపోయాడు అంటూ రెస్ట్ తీసుకోవాల‌నే కామెంట్లు కూడా రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతున్నాయి. ఇలాంటి క‌ష్టాలు ఎదుర్కొంటున్న‌ బాబుకు.. ఉన్న‌వారు కూడా సైకిల్ దిగిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌డం.. మూలిగేన‌క్క‌పై తాంటిపండు ప‌డ్డ చందంగా త‌యార‌వుతోంది.

ఇప్ప‌టికే.. ప‌లువురు ఎమ్మెల్యేలు వైసీపీ నేత‌లుగా చెలామ‌ణి అవుతున్నారు. కొంద‌రు ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీకి బ‌ల‌మైన నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శోభా హైమావ‌తి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. దాదాపు 22 సంవ‌త్స‌రాల‌పాటు పార్టీలో కొన‌సాగిన ఆమె.. పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లనే వెళ్లిపోతున్న‌ట్టు చెప్పేశారు. దాదాపు ఏడాదిన్న‌ర కాలంగా పార్టీ త‌న‌ను దూరం పెడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌మిటీ నుంచి త‌న పేరు కూడా తొల‌గించార‌ని చెప్పారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సైతం త‌న‌ను పిల‌వ‌ట్లేద‌ని అన్నారు. గౌర‌వం లేని చోట ఉండ‌లేక‌నే.. ఆవేద‌న‌తో పార్టీ నుంచి వెళ్లిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. హైమావ‌తి కూతురు స్వాతి వైసీపీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగానే శోభా హైమావ‌తితో పార్టీ డిస్టెన్స్ మెయింటెయిన్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. దీంతో.. ఇన్నాళ్లూ హైమావ‌తి కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. ఇప్పుడు ఉన్న‌ట్టుండి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రి, ఆమె వైసీపీలో చేర‌తారా? అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. స‌న్నిహితులు, మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి చ‌ర్చించిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు. అయితే.. వైసీపీలో చేరేందుకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు.

ఈ విధంగా.. కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. న‌లుగురు ఎంపీలు సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్‌, సీఎం ర‌మేష్‌, గ‌రిక‌పాటి బీజేపీలో చేరిపోయారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్ద‌లా గిరి, క‌ర‌ణం బ‌ల‌రాం కూడా గుడ్ బైచెప్పారు. కేవ‌లం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం కోస‌మే ఎదురు చూస్తున్న నేత‌లు కూడా ప‌లువురు ఉన్న‌ట్టుగా చెబుతున్నారు. అధికారం కోల్పోవ‌డం.. ఇలా కీల‌క నేత‌లు పార్టీని వీడ‌డంతో టీడీపీ మ‌రింత‌ బ‌ల‌హీనంగా మారుతోంది. మ‌రి, ఈ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News