చంద్రబాబు మీద ఇంత కడుపుమంటుందా ?

Update: 2021-10-22 07:33 GMT
తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు చంద్రబాబునాయుడు మీద ఎంత కడుపుమంట ఉందో అర్ధమైపోతోంది. చంద్రబాబు 36 గంటల దీక్షా శిబిరం దగ్గర గురువారం మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ మాట్లాడిన మాటలు చూస్తుంటే తమ్ముళ్ళకే మతిపోయింది. పార్టీ ఆఫీసుల మీద వైసీపీ నేతల దాడి గురించి బోండా ప్రస్తావించారు. దాడులు చేయటం తప్పని చెప్పుంటే బాగుండేది. కానీ బోండా అలా చెప్పకుండా తాము ఎవరమూ లేని సమయంలో పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం మగతనం కాదని తేల్చి చెప్పారు.

వైసీపీ వాళ్ళ మగతనం ఏపాటిదో చెప్పి ఆపేసుంటే బాగుండేది. కానీ అంతటితో ఆపని బోండా శుక్రవారం సాయంత్రం వరకు చంద్రబాబు ఇక్కడే దీక్ష చేస్తారు, దమ్ముంటే శిబిరం దగ్గరకు వచ్చి చంద్రబాబును కొట్టడంటూ బహిరంగంగా సవాలు విసిరారు. చంద్రబాబు మీద దాడి చేసి వైసీపీ నేతలు వాళ్ళ మగతనం నిరూపించుకోవాలంటు సవాలు విసరటమే విచిత్రంగా ఉంది.

వైసీపీ వాళ్ళు మగతనం నిరూపించుకోవాలంటే తనింటి మీదకు రమ్మని బోండా చాలెంజ్ చేసినా అదోరకంగా ఉంటుంది. అలాకాకుండా వచ్చి చంద్రబాబును కొట్టమని సవాలు విసరడం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. బోండా చాలెంజ్ విన్న మిగిలిన వాళ్ళకు నిజంగానే మతిపోయింది. బోండా చాలెంజ్ ను చాలెంజ్ గా తీసుకుని ఎవరైనా వైసీపీలోని ఆవేశపరులు శిబిరంలోని చంద్రబాబుపై దాడి చేస్తే అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ? శిబిరం దగ్గరకు వచ్చి చంద్రబాబు మీద దాడి చేయమని చాలెంజ్ విసిరిన బోండా తీసుకుంటారా లేకపోతే దాడిచేసిన వారిది తప్పా ?

ఇదే విషయమై మంత్రి పేర్నినాని మాట్లాడుతు చంద్రబాబుపై తమ్ముళ్ళ కడుపులో ఎంత కుళ్ళుందో అర్ధమైపోతోందన్నారు. కాస్త అటు ఇటుగా లోకేష్ కూడా ఇలాగే చాలెంజ్ విసిరారు. తాము ఎవరమూ పార్టీ ఆఫీసుల్లో లేని సమయంలో వచ్చి దాడులు చేయటం కాదన్నారు. ధైర్యముంటే ఇపుడు వచ్చి దాడి చేయమన్నట్లుగా ఉంది లోకేష్ చాలెంజ్.


Tags:    

Similar News