దమ్ము చూపిన క్యాడర్, చతికిలపడిన లీడర్

Update: 2021-11-18 15:30 GMT
తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. నేతలకన్నా కార్యకర్తల్లోనే పార్టీపట్ల కమిట్మెంట్ కనబడుతోంది. ఈ విషయం తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడుతోంది.

12 మునిసిపాలిటీలకు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ ఫలితాలను స్వీప్ చేసేసింది. చాలా మున్సిపాలిటీల్లో ప్రజలు ఏకపక్షంగా అధికారపార్టీకి ఓట్లేశారు.

అయితే ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ గెలిచింది. అలాగే కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటిల్లో టీడీపీ బాగా పుంజుకుంది. కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.

జగ్గయ్యపేట మున్సిపాలిటీలో దాదాపు గెలుపు అంచుల వరకు వచ్చింది. ఈ ఫలితాలను చూసిన తర్వాత నేతలకన్నా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లోనే పార్టీపట్ల ఎక్కువ కమిట్మెంట్ ఉందనిపిస్తోంది.

ఎలాగంటే దర్శి లో పార్టీకి చెప్పుకోదగ్గ నేతలే లేరు. అలాగే కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి ఒకరిద్దరు ఉన్నా ఈయనకన్నా స్ధానిక నేతలు పార్టీ కోసం ఎక్కువ కష్టపడ్డారట.

అలాగే జగ్గయ్యపేటలో కూడా ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఎక్కువగా కష్టపడినట్లున్నారు. ఇక కర్నూలు జిల్లాలోని బేతంచర్ల నగర పంచాయితీలో టీడీపీకి అసలు దిక్కనేదే లేదు. ఇలాంటి పంచాయితిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేసిన కుప్పంలో ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ మాజీ మంత్రులు, ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు, మాజీ ఎంఎల్ఏలు ఎంతమంది మోహరించినా ఉపయోగంలేకపోయింది.

అలాగే నెల్లూరులో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, ఎంఎల్సీలు+చాలామంది నేతలున్నా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

ఇంతమంది దృష్టిపెట్టి గెలుపుకోసం చెమటోడ్చిన నెల్లూరు, కుప్పం లాంటి చోట్ల పార్టీ ఓడిపోయింది. ఇదే సమయంలో గెలుపుకు పెద్దగా దృష్టిపెట్టని, చెప్పుకోదగ్గ నేతలు లేని దర్శి, కొండపల్లి, జగ్గయ్యపేట, బేతంచెర్ల లాంటి చోట్ల మెరుగైన ఫలితాలు సాధించటం గమనార్హం.

కేవలం స్ధానికంగా ఉన్న నేతలు సమైక్యంగా కష్టపడటం వల్లే మంచి ఫలితాలు సాధించినట్లు అర్ధమవుతోంది. దర్శి మున్సిపాలిటిలో అధికారపార్టీ నేతల్లోని అంత:కలహాలను టీడీపీ నేతలు అడ్వాంటేజ్ తీసుకోవటం కూడా పార్టీకి కలిసొచ్చింది.

ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్రమంతా టీడీపీ ఘోరంగా ఓడిపోతే తాడిపత్రి మున్సిపాలిటిలో మాత్రమే టీడీపీ గెలిచింది. ఇపుడు కూడా 13 చోట్ల ఎన్నికలు జరిగితే దర్శి, కొండపల్లిలో మాత్రమే గెలిచింది. అప్పట్లో కూడా తాడిపత్రిలో టీడీపీ నేతలు, క్యాడర్ కలిసికట్టుగా పని చేయటం వల్లే టీడీపీ గెలిచింది.

ఇపుడు గెలిచిన మున్సిపాలిటిల్లో కూడా అదే కనబడుతోంది. అందుకనే పార్టీ పట్ల ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్లో ఉన్న కమిట్మెంట్ సీనియర్ నేతల్లో లేదని అర్ధమైపోతోంది.


Tags:    

Similar News