సీమలో సీనియర్ నేత సైకిలెక్కేస్తారట... ?

Update: 2022-01-14 13:48 GMT
రాజకీయాల్లో జంపింగులు చాలా కామన్. దీని మీద ఎవరూ ఎవరినీ అనే చాన్సే లేదు. ఎందుకంటే అన్ని పార్టీలూ, నేతలూ ఆ తానులో గుడ్డలే. ఇక ఒపీనియన్స్ చేంజ్ చేసుకోకపోతే పాలిటీషియన్ కారు అని ఏనాడో గురజాడ వారి కన్యాశుల్కంలో గిరీశం చెప్పేశారు కాబట్టి ఎవరికీ ఏ చీకూ చింతా పెట్టుకోనవసరం లేదు. ఇదిలా ఉంటే ఎన్నికలకు చాలా దూరం ఉండగానే ఎవరి రాజకీయం వారు చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం సేఫెస్ట్ ప్లేస్ ని కూడా ఎంచుకుంటున్నారు

ఆ విధంగా చూసుకుంటే రాయలసీమకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పార్టీ మారుతారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఇపుడు బీజేపీలో ఉన్నారు. నిజానికి పక్కా కాంగ్రెస్ అయిన వెంకటేష్ 2014లో విభజన తరువాత టీడీపీలో చేరారు. అందుకు గానూ ఆయన రాజ్యసభ సభ్యత్వం పొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడాక ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు

ఈ జూన్ తో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. దాంతో ఆయన మళ్ళీ ఎలాంటి సంకోచం లేకుండా టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు అంటున్నారు. తన కుమారుడిని టీడీపీలో అట్టేబెట్టే ఆయన బీజేపీలో చేరారు. టీజీ కుమారుడు టీజీ భరత్ కర్నూల్ టౌన్ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టీడీపీ తరఫున  టికెట్ ఖాయమనే అనుకుంటున్నారు.

దాంతో కుమారుడి విజయాన్ని కాంక్షిస్తూ వెంకటేష్ కూడా కాషాయం వదిలేసి సైకిలెక్కుతారు అని అంటున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తులు ఖాయమని, బీజేపీతో టీడీపీ కలసి వెళ్ళడం డౌటే అని టీజీ భావిస్తున్నారుట. ఈ కారణం వల్ల కూడా ఆయన సొంత పార్టీ వైపు రావడానికి చూస్తున్నారుట. మొత్తానికి ఈ సీనియర్ ఎంపీ కనుక పార్టీ మారితే సీమ రాజకీయాల్లో సైకిల్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు.
Tags:    

Similar News