​ఖమ్మం జిల్లాలో పెదరాయుడు

Update: 2016-03-24 04:49 GMT
ఖమ్మం జిల్లాలోని ఓ కుగ్రామంలో చోటు చేసుకున్న ఆరాచకం ఒకటి బయటకు వచ్చింది. ఊళ్లో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమ నిర్వహణ కోసం చందాలు ఇవ్వని 15 కుటుంబాల్ని వెలి వేయటం సంచలనంగా మారింది. కుల పెద్ద మాటకు భిన్నంగా డబ్బులు ఇవ్వని ఆ కుటుంబాల్ని వెలి వేయటమే కాదు.. ఘోరమైన తప్పు చేసినట్లుగా వారికి శిక్ష విధించారు. తాజాగా నెలకొన్న ఆంక్షలో ఉన్న ఊళ్లో.. ఊరి జనాలకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా తయారు కావటమే కాదు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి.

ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయితీ పరిధిలోని తుమ్మల గూడెంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమం కోసం ప్రతి కుటుంబం రూ.6వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే.. 15 గిరిజన కుటుంబాలు మాత్రం ఈ మొత్తాన్ని ఇవ్వలేమని చెప్పారు. దీంతో.. ఆగ్రహించిన గ్రామపెద్దలు వీరిని వెలివేశారు. దీంతో.. వీరు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

గ్రామ పెద్దలు వెలి వేసిన నాటి నుంచి వీరితో ఎవరూ మాట్లాడటం కానీ.. వారిళ్లకు పిలవటం కానీ.. చివరకు వారికి మంచినీరు ఇచ్చేందుకు సైతం ఒప్పుకోవటం లేదు. అంతేకాదు.. వారికి పని ఇచ్చినా రూ.10వేలు జరిమానా చెల్లించాల్సిందే. దీంతో ఉన్న ఊళ్లో వారు పరాయిగా మారటమే కాదు.. తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. చివరకు.. వారిళ్లల్లోని చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకోవటం మానేశారు. ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి రావటంతో.. ఈ అంశంపై కౌన్సెలింగ్ నిర్వహించి.. చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాఘవరెడ్డి చెబుతున్నారు. చర్యల కంటే కూడా ఇలాంటివి అనాగరికమన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటం ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు దొర్లినా బాధితుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News