డబ్బే డబ్బు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేకు.?

Update: 2021-03-04 08:30 GMT
రాజకీయాల్లో రాను రాను కొత్త విధానాలు పుట్టుకొస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ రాజీ మార్గం పెరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.  కరోనా కారణంగా ఈ ఎన్నికలు ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ మధ్య పోరుతో వాయిదాల మీద వాయిదా పడుతూ మొత్తానికి ప్రశాంతంగానే జరిగాయి. అయితే వైసీపీ ప్రభుత్వం చాలా వరకు గ్రామాల్లో ఏక్రగీవాలకే మొగ్గు చూపింది. ఆయా గ్రామాలు ఏకగ్రీవాలు చేసుకుంటే ప్రొత్సాహకాలను అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 25 శాతానికి ఎక్కువగానే గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇదే అదనుగా భావించి పోటీ చేసే అభ్యర్థుల మధ్య ఓ రాజీ టెక్నిక్ పాటించాడట. పైకీ ఏకగ్రీవంగా కనిపించినా లోపల జరిగింది మాత్రం కథ వేరేనన్న చర్చ జరుగుతోంది. మరి ఆ కథేంటో తెలుసుకుందాం..

ఎన్నికలనగానే ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద సంపాదన ఏం లేకపోయినా ప్రతిష్టం కోసం కొందరు విపరీతంగా ఖర్చు పెట్టి సర్పంచ్ పదవి దక్కించుకుంటారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలను బట్టి 10 లక్షల నుంచి కోట్లరూపాయల్లో వ్యయం అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. కొందరు ఈ ఖర్చుకు వెనుకాడకుండా విచ్చలవిడిగా ధనాన్ని వెదజల్లి పరువు దక్కించుకుంటారు.

అయితే ఓ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఓ కొత్త స్కీం పెట్టాడట. ఉదాహరణకు ఓ గ్రామంలో సర్పంచ్ గా పోటీచేసే ఆశావహులను పిలిచి సమావేశం నిర్వహించాడట. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి చెరో రెండున్నరేళ్లు పాలించేటట్లు చేశాడట. ఎన్నికల్లో గెలవడానికి ఎలాగూ 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుందని... ఇద్దరికి కలిపి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తారని హితబోధ చేశాడట.. అదే ఇద్దరు రాజీకొచ్చి చెరో రెండున్నరేళ్లు పాలిస్తే బెటరని సూచించాడట. దీంతో ఇదేదో మంచిగుందని వారు కూడా ఒప్పుకున్నారట.

ఈ డీల్ కుదిర్చినందుకు ఆ ఎమ్మెల్యే ఒక్కో ఆశావహుని నుంచి కొంత డబ్బును తీసుకున్నాడట. ఇందులో ముందుగా అధికారం చేపట్టిన వాళ్లు రూ.10 లక్షలు, రెండోసారి అధికారం చేపట్టేవాళ్ల నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడట. ఇలా సెటిల్మెంట్ చేస్తూ తన నియోజకవర్గంలోని చాలా గ్రామాలను ఏకగ్రీవం చేశాడట ఆ ఎమ్మెల్యే. అయితే ఇందులో టీడీపీ నుంచి పోటీచేసేవారు కూడా లాభపడ్డారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ ఎమ్మెల్యే చిలక్కొటుడు వ్యవహారాలతో ఇన్నిరోజులు వైసీపీ జెండా పట్టుకొని ఉన్న అసలైన వైసీపీ వాళ్లు తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతోందని నిరాశలో ఉన్నారట... ఏదీ ఏమైనా ఆ ఎమ్మెల్యేకు మాత్రం డబ్బే.. డబ్బు..
Tags:    

Similar News