భారత్‌ కు చెందిన ఆ ఫోటోతో పాక్ నోరు మూయించిన అఫ్గాన్ ఉపాధ్యక్షుడు !

Update: 2021-07-23 06:33 GMT
అఫ్గనిస్థాన్‌ నుండి సైన్యం వెనక్కి తగ్గిన తర్వాత, అఫ్గనిస్థాన్‌ కొంచెం కొంచెంగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్తుంది. తాలిబన్లకు పాకిస్థాన్ ప్రభుత్వం కొమ్ము కాస్తుండగా , అఫ్గాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ కి చెందిన కొందరు  ట్రోలింగ్‌ చేస్తున్నారు. దీంతో సహనం నశించిన అఫ్గన్‌ ప్రభుత్వ పెద్దలు ఒక్క ఫొటోతో పాక్‌ ట్రోలర్ల నోరు మూయించారు. భారత్‌ విజయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసి దిమ్మదిరిగే కౌంటర్ ఇవ్వడంతో పాక్ నెటిజన్ల గొంతులో నుండి మరో మాట రాలేదు.

మంగళవారం రోజు ఈద్‌ అల్‌ అదా పర్వదినం సందర్భంగా అఫ్గన్‌ అధ్యక్ష భవనంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో పాటు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో అధ్యక్ష భవనాన్న లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు రాకెట్‌ దాడులకు తెగబడ్డారు. అదృష్టవశాత్తూ ఆ రాకెట్ అధ్యక్ష భవనం సమీపంలో పడింది. ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా, తర్వాత తమాయించుకొని దాడిని లెక్కచేయకుండా ప్రార్థనలు కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వ్యంగ్యంగా స్పందించారు.

పొరుగున ఉన్న స్పిన్ బోల్డాక్ ప్రాంతం నుంచి తాలిబాన్లపై అఫ్గన్ నేషనల్ ఆర్మీ (ఏఎన్ ఏ), ఆఫ్ఘన్ వైమానిక దళాలు దాడికి ప్రయత్నిస్తే తిప్పికొడతామని పాక్ వైమానిక దళం హెచ్చరించిందని అమ్రుల్లా సలేహ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్ నుంచి అమెరికా, మిత్రరాజ్యాల సేనలు వైదొలగడంతో తాలిబన్లు మరోసారి రెచ్చిపోతున్నారు. గతంలో తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటున్నారు. రెండు దశబ్దాల పాటు అఫ్గన్ గడ్డపై యుద్ధం చేసిన అమెరికా.. తన సేనలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లకు పాక్ ఉగ్రమూకలు సహకారం అందిస్తున్నాయి.

కొద్ది సేపటి ముందే ఖతార్ వేదికగా తాలిబన్లతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన అమ్రుల్లా సలేహ్‌ కు ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. పాక్ నెటిజన్ల నోరు మూయించాలని నిర్ణయించుకున్నారు. దీనితో 1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ ఘోర పరాజయం తర్వాత ఢాకాలోని రేస్‌ కోర్స్‌ లో తీసిన ఫోటోను ఆయన పోస్టు చేశారు. తమ సైన్యం భారత్‌ కు లొంగిపోతున్నట్టు అంగీకరిస్తూ పాక్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ సంతకం చేస్తున్నట్లుంది. పక్కనే భారత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జగ్‌ జీత్‌ సింగ్‌ అరోరా కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేసిన అమ్రుల్లా .. మన చరిత్రలో ఇలాంటి ఫొటో ఏదీ లేదు, ఎప్పటికీ ఉండదు. అవును, నిన్న ఒక రాకెట్ నా మీది నుంచి వెళ్లి, కొన్ని మీటర్ల దూరంలో పడింది. నేను ఒక్కసారిగా కదిలిపోయాను. ప్రియమైన పాకిస్తాన్ ట్విటర్ అటాకర్స్.. ఈ ఫొటో చేసిన గాయాన్ని తాలిబన్లు, టెర్రరిజం నయం చేయదు. వేరే దారులు వెతకండి అని ట్వీట్ చేశారు.


అమరుల్లా షేర్ చేసిన ఈ ఫొటోను మొదటి మూడు గంటల్లోనే పది వేల మందికి పైగా లైక్ చేశారు. వందల మంది ఆయన ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు.కొంతమంది ఆయన ట్వీట్‌ కు భారత సైన్యం ముందు పాకిస్తాన్ లొంగిపోయినప్పటి వీడియోను కూడా పోస్ట్ చేశారు. మరికొందరు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి ఇంటి దగ్గర రాకెట్ పడినప్పుడు ఆయన ఆందోళనకు గురైన వీడియోను కూడా షేర్ చేశారు.

 సోషల్ మీడియాలో అమరుల్లా సాలేహ్ ట్వీట్ చేసిన ఎన్నో ఫొటోల గురించి వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఒక పేలుడు శబ్దం విని సాహసికుడైన ఒక ఉపాధ్యక్షుడి పాంట్ తడిచిపోవడం, ఆయన సిగ్గుపడి మళ్లీ నమాజ్ కొనసాగించిన వీడియో క్లిప్‌ ను కూడా మేం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని పాకిస్తాన్ టీవీ హోస్ట్, నటి సెహర్ షిన్వారీ ట్వీట్ చేశారు.

 సాలేహ్ షేర్ చేసిన ఈ ఫొటో 1971కి చెందిన ఒక చరిత్రాత్మక ఫొటో. పాకిస్తాన్ సైన్యం ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోతున్న సమయంలో దీన్ని తీశారు. 1971 యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్‌ పరాజయం పాలైంది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ దాదాపు 90వేల మంది సైనికులతో తూర్పు పాకిస్తాన్‌ లో లొంగిపోవాల్సి వచ్చింది. ఆ లొంగుబాటు తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్‌ కు స్వతంత్రం లభించింది. అది బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. ఈ ఫొటోలో ఒప్పందంపై సంతకం చేస్తున్న జనరల్ నియాజీ పక్కనే అదే టేబుల్ దగ్గర అప్పటి ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ జీత్ సింగ్ ఆరోడా కూడా కూర్చుని ఉంటారు. భారత సైన్యం, బెంగాలీల చేతుల్లో పాకిస్తాన్ ఓడిపోయి, లొంగిపోయిన ఈ ఘటనను ఆ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా అక్కడి నిపుణులు వర్ణిస్తారు. అప్పట్లో నావికా దళ తూర్పు కమాండ్ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్ ఎన్ కృష్ణన్ తన ఆత్మకథ ఎ సెయిలర్స్ స్టోరీ లో ఈ ఘటన గురించి రాశారు.

కొన్నిరోజుల క్రితం అఫ్గానిస్తాన్ తొలి ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ పాకిస్తాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. స్పిన్ బోల్డక్ ప్రాంతం నుంచి తాలిబన్లను తరిమికొట్టేందుకు ఎవరూ ప్రయత్నించినా తమ వైమానిక దళం తగిన సమాధానం చెబుతుందని అఫ్గాన్ నేషనల్ ఆర్మీ , అఫ్గాన్ వైమానిక దళాన్ని పాకిస్తాన్ అధికారికంగా హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లకు పాకిస్తాన్ వైమానిక మద్దతు ఇస్తోంది అని ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు చూపిస్తానని కూడా ఆయన అన్నారు. కానీ, సాలేహ్ ఆరోపణలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని పాక్ సైనికులు, ప్రజల రక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టామని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
Tags:    

Similar News