50-55 భయం.. ఉద్యోగులు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే

Update: 2020-08-30 15:30 GMT
ప్రైవేటు సంస్థలకు.. ప్రభుత్వ సంస్థలకు తేడా భారీగా ఉంటుంది. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనవళ్ల వరకు కూర్చొనే తినేలా సంపాదిస్తున్నారు. పైగా తమను ఎవరూ ఏం చేయాలేరని.. ఉద్యోగాల్లోంచి తీసివేయరనే ధీమా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంది.

అదే ప్రైవేటులో అలా ఉండదు.. పనిచేయకున్నా.. బద్దకించినా.. అవినీతి చేసినా.. అసమర్థత చూపినా తీసేస్తారు. జీతాలు పెంచరు. ఇప్పుడే ఎత్తుగడను కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులపై ప్రయోగించబోతోందట..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసమర్థులకు, అవినీతిపరులకు చెక్ చెప్పేందుకు ‘ముందస్తు-నిర్బంధ’ పదవీ విరమణపై మోడీ సర్కార్ సవివరమైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మెమోరాండం జారీ చేసింది.

ప్రజా ప్రయోజనం.. సమర్థపాలన, ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసం ఉద్యోగులకు ముందుగానే రిటైర్ మెంట్ ప్రకటించే విషయంలో కేంద్రప్రభుత్వానికి ప్రత్యేక హక్కులను ఇందులో కట్టబెట్టారు. 30 సంవత్సరాల సర్వీసు లేదా 50-55 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తారు. నిజాయితీగా ఉంటే ఉంచుతారు. లేదంటే రిటైర్ చేస్తారు.

అయితే ఉద్యోగుల పనితీరును ఏ స్థాయి వారు.. ఎప్పుడెప్పుడు సమీక్షించాలనే వివరాలను కూడా ఈ మొమోరాండంలో వివరించారు.

ఈ క్రమంలోనే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 56(జే) నిబంధన అనే ఈ అస్త్రాన్ని విరివిగా వాడుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ సహా అఖిల భారత సర్వీసు అధికారులు అనేకమందికి ‘నిర్బంధ పదవీ విరమణ’ పేరిట ఇంటికి పంపించింది.

తాజాగా ‘ఉద్యోగుల తొలగింపు కేంద్రం హక్కు’ అని కేంద్రం మొమారాండం జారీ చేసింది. సుపరిపాలన కోసం అసమర్థులను -పనికిరాని వారిని పక్కనపెట్టాల్సిందేనన్న సుప్రీం కోర్టు వాదనను ఈ మొమోరాండంలో ఉటంకించారు. అన్ని ప్రయోజనాలను కల్పించే రిటైర్ ఇచ్చేస్తారు.

దీని కారణంగా ఇక ప్రభుత్వ ఉద్యోగం వస్తే తాము ఏం చేసినా చెల్లుతుందని నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడే అధికారులకు చెక్ పడుతుంది.




Tags:    

Similar News