గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా ?

Update: 2021-10-20 15:30 GMT
చాలకాలంగా చర్చలకు మాత్రమే పరిమితమైన నదుల అనుసంధానం విషయాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లే అనిపిస్తోంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రక్రియలో స్పీడు పెంచేందుకు కేంద్ర జలశక్తి ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈనెల 28వ తేదీన గోదావరి, కావేరి నదుల పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కలిపి కేంద్ర జలశక్తి శాఖ ఓ సమావేశం ఏర్పాటు చేయబోతోంది.

సీఎంలందరితో కలిపి ఏర్పాటు చేయబోయే కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఛైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. కేంద్రమంత్రి సమక్షంలో జరగనున్న సమావేశం తర్వాత మరుసటి రోజే అంటే 29వ తేదీన జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జలసౌదలో వివిధ రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరగబోతోంది. అంటే జరిగేది చూస్తుంటే నదుల అనుసంధానం విషయంలో కేంద్రం సీరియస్ గానే ఉందని అర్ధమవుతోంది.

నదుల అనుసంధానానికి సంబంధించి మహానది-గోదావరి-కృష్ణా-కావేరి గ్రాండ్ ఆనకట్టలను అనుసంధించాలనే ఆలోచన ఎప్పటినుండో ఉంది. అయితే మహానాదికి సంబధించి ఒడిస్సా ప్రభుత్వం నుండి పదే పదే అభ్యంతరాలు వస్తున్నాయి. దాంతో గ్రాండ్ ఆనకట్ట అనుసంధానాన్ని కేంద్రం పక్కన పెట్టేసింది. అందుకనే ముందుగా గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని మొదలుపెట్టి తర్వాత గ్రాండ్ ఆనకట్ట అనుసంధానం అంశాన్ని చేపట్టాలని కేంద్రం డిసైడ్ చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గోదావరి-కావేరి అనుసంధానంపై తెలుగురాష్ట్రాలు కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. అలాగే గోదావరి జలాల వినియోగంపైన కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కావేరి జలాల వినియోగంపై కర్నాటక-తమిళనాడు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఏ విధంగా చూసినా నదీజలాల వినియోగం విషయంలో ప్రతిరెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి నీటి వృధాను అరికట్టాలంటే నదుల అనుసంధానమే ప్రధానమైన పరిష్కారం. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు తాము వాడుకుంటున్న నీటిని వాడుకుని వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నాయి. అంటే పక్కరాష్ట్రానికి సహకరించాలనే కనీసం మానవత్వాన్ని కూడా రాష్ట్రాలు మరచిపోతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో కేంద్రం టేకప్ చేసిన నదుల అనుసంధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.


Tags:    

Similar News