తాజ్ మీద ర‌చ్చ రోజురోజుకీ పెరుగుతోందే!

Update: 2017-10-25 05:35 GMT
శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా.. కొన్ని ఊహాజ‌నిత అంశాల్ని పోగేసి ర‌చ్చ చేయ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. త‌ల‌కెక్కిన కొన్ని భావ‌జాలాలు అంత‌కంత‌కూ పెరిగిపోయి.. అంద‌రికి ఇబ్బందిగా మారేలా చేస్తున్న కొంద‌రి పుణ్య‌మా అని కొత్త ఉద్రిక్త‌త‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి.

ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ప్రేమ‌చిహ్నంగా తాజ్ మ‌హల్‌ కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే.. తాజ్ మ‌హల్ నిర్మాణానికి ముందు..ఆ ప్రాంతంలో ఒక శివాల‌యం ఉండేద‌ని.. దాన్ని మొఘ‌ల్ రాజు కూల్చేసి ఈ ప్రేమ క‌ట్ట‌డాన్ని నిర్మించిన‌ట్లుగా ఒక వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చారు. ఆ వాద‌న‌లో నిజం లేద‌ని.. ఇప్ప‌టికే తేల్చిన‌ప్ప‌టికీ కొంద‌రికి మాత్రం తాము ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజ్ మ‌హ‌ల్ వ‌ద్ద కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసేలా కొన్ని సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అందులో ముఖ్యంగా రాష్ట్ర స్వాభిమాన్ ద‌ళ్‌.. హిందూ యువ‌వాహిని త‌దిత‌ర సంస్థ‌లు ఉన్నాయి. త‌మ ఊహాజ‌నిత భావాల్ని జ‌నాల మీద రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పాలి. వీరికి త‌గ్గ‌ట్లే బీజేపీకి చెందిన కొంద‌రు నేత‌ల విచిత్ర వ్యాఖ్య‌లు ప‌రిస్థితిని మ‌రింత దారుణంగా త‌యార‌య్యేలా చేస్తున్నాయి.

బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే చూస్తే.. హిందువుల్ని అణిచేసిన దేశ ద్రోహులు క‌ట్టిన ఈ స్మార‌క చిహ్నానికి ప్ర‌పంచ గుర్తింపు ఇవ్వ‌టం ఏమిటంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు.. త‌మ పార్టీకి సంబంధం లేదంటూ బీజేపీ నేత‌లు చెప్పినా.. ఇలాంటి మాట‌ల్ని క‌ట్ట‌డి చేసేందుకు మాత్రం పార్టీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. త‌మ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు త‌మ స‌ర్కారుకు సంబంధం లేద‌ని యూపీ బీజేపీ స‌ర్కారు స్ప‌ష్టం చేసింది.

త‌ప్పు చేసిన‌ప్పుడు మంద‌లించ‌ట‌మో.. చ‌ర్య‌లు తీసుకోకుండా.. సంబంధం లేద‌ని చెప్పుకోవ‌టం లాంటివి మ‌రిన్ని సిత్ర‌మైన ప‌రిణామాల‌కు అవ‌కాశం ఇస్తుంటాయి. దీనికి త‌గ్గ‌ట్లే.. స‌ద‌రు ఎమ్మెల్యే  మాట‌ల ప్ర‌భావ‌మో.. మ‌రేదైనా కార‌ణ‌మో కానీ తాజాగా రాష్ట్ర స్వాభిమాన్ ద‌ళ్‌.. హిందూ యువ‌వాహిని సంస్థ‌ల‌కు చెందిన డ‌జ‌న్ మంది తాజ్ మ‌హ‌ల్ ద‌గ్గ‌ర శివ చాలీసా ప‌ఠించారు.

తాజ్ మ‌హ‌ల్ చారిత్ర‌క  క‌ట్ట‌డం కాద‌ని.. తాజ్ దేవాల‌యం అంటూ నినాదాలు చేయ‌టంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.  వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు క్ష‌మాప‌ణ ప‌త్రాల్ని రాయించి విడుద‌ల చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర స్వాభిమాన్ ద‌ళ్‌ కు చెందిన దీప‌క్ శ‌ర్మ అనే నేత మాట్లాడుతూ.. గ‌తంలో తేజోమ‌లాయ పేరుతో శివాల‌యం ఉండేద‌ని.. దాన్ని స్థానంలో తాజ్ మ‌హ‌ల్ నిర్మించార‌ని.. తాజ్ ద‌గ్గ‌ర నమాజ్ చేసే అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు శివ‌చాలీసా ప‌ఠించే అవ‌కాశం కూడా ఇవ్వాలంటూ కొత్త డిమాండ్‌ ను తెర మీద‌కు తెచ్చారు. త‌మ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

తాజ్ వివాదానికి సంబంధించి ఇదేం మొద‌లు కాదు. గ‌తంలో బీజేపీ ఎంపీ విన‌య్ క‌టియార్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజ్ మ‌హ‌ల్‌ ను తాజ్ మందిర్ లేదంటే తేజో మ‌హాల‌య‌గా మార్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బీజేపీ నేత‌ల మాట‌లు ఈ తీరులో ఉండే మ‌రోవైపు తాజ్ విష‌యంలో యూపీలోని బీజేపీ స‌ర్కారు తీరు కూడా ప్ర‌శ్నించేలా ఉన్నాయి. తాజ్ లాంటి నిర్మాణం స‌మీపంలో వాహ‌నాల పార్కింగ్ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. పార్కింగ్ నిర్మాణాన్ని వెంట‌నే నిలిపివేయాల‌ని ఆదేశించింది కూడా. ఇప్పుడున్న పంచాయితీలు స‌రిపోవ‌న్న‌ట్లుగా తాజ్ మీద తెర మీద‌కు తెస్తున్న అంశాలు కొత్త ఉద్రిక్త‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News