మాజీ ప్రధాని కూతురు బాత్రూంలో కెమెరాలు ... ఎవరు పెట్టారంటే !

Update: 2020-11-13 16:00 GMT
మరియం నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్‌ షరీఫ్ గతేడాది అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్‌, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్ ‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్ ‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే, ఈ మధ్యే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను రెండుసార్లు జైలు జీవితం గడిపానని, ఈ సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. ఓ మహిళగా తనతో ఎలా వ్యవహరించారు అన్నదానిపై మాట్లాడితే, ప్రభుత్వ పెద్దలకు ముఖాలు చూపించే ధైర్యం కూడా ఉండదంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను జైలు జీవితం గడిపే సమయంలో నేను ఉండే జైలు గది సహా బాత్రూమ్ ‌లోనూ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్‌ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే ఇక పాకిస్తాన్ ‌లోని ఏ మహిళకు రక్షణ లేనట్లే అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ లేదా మరెక్కడైనా మహిళలు బలహీనులు కాదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని, ప్రస్తుత పిటిఐ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తే, రాజ్యాంగ పరిధిలో సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ సిద్దమేనన్నారు. తాను వ్యవస్థలకు వ్యతిరేకం కాదని, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్ ‌మెంట్ వేదిక ద్వారా చర్చలకు సిద్ధమని స్పష్టంగా తెలియజేశారు.
Tags:    

Similar News