పార్టీల‌కు మ‌రో వ‌రంగా మార‌నున్న ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం

Update: 2022-10-04 13:30 GMT
ఎన్నిక‌ల్లో ఉచిత హామీలు ప్ర‌క‌టించి.. రాష్ట్రాల‌ను అప్పుల పాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయ పార్టీల‌పై కొన్నాళ్లుగా దుమారం రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సుప్రీం కోర్టులో కూడా విచార‌ణ జ‌రిగింది.  ఈ విచార‌ణ‌లో భిన్న‌మైన అభిప్రాయాలు వెల్ల‌డ‌య్యాయి. ఏది ఉచితం.. ఏది అనుచితం అనే చ‌ర్చ కూడా వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఎటూ తేల్చ‌ని సుప్రీం కోర్టు.. ఈ విష‌యాన్ని ఏదో ఒక‌టి తేల్చాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చెప్పింది. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని రాజ‌కీయ పార్టీల‌ను ఎన్నిక‌ల సంఘం తాజాగా ఆదేశించింది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల జాబితా, వాటిని ఎలా నెరవేరుస్తారు, అందుకు ఉన్న ఆర్థిక వనరులు ఏంటో పార్టీలు స్పష్టంగా ఓటర్లకు తెలియజేయాలని లేఖలో ఈసీ సూచించింది.

ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదాన్ని కొట్టిపారేయాలేమని ఈసీ అభిప్రాయపడింది. ఉచిత హామీలకు సంబంధించి అనుసరించాల్సిన ఒక ఉమ్మడి ఫార్మాట్‌ను ఈసీ.. పార్టీలకు పంపింది.

అలాగే 2015 ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చిన వివరాలు అందించాలని ఈసీ కోరింది. వాటిపై ఈనెల 19 లోపు సమాధానం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలోపేతం చేయడానికి.. రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

ఈ నిర్ణ‌యంపైనా భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలు.. పార్టీల‌కు మ‌రింత ఛాన్స్ ఇచ్చిన‌ట్టేన‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అది ఇస్తాం.. ఇది ఇస్తాం.. అని చెబుతున్న పార్టీలు.. ఇక‌పై మీకోసం.. ఇంతింత ఖ‌ర్చు చే్స్తున్నాం.. చేస్తాం.. అని మ‌రింత ఊద‌ర‌గొట్టేందుకు అవ‌కాశం ఉంది. అయితే.. నిధులు ఎక్క‌డ నుంచి స‌మీక‌రిస్తార‌నే విష‌యంలో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. ఇది మిన‌హా.. రాజ‌కీయ పార్టీల‌కు తాజా నిర్ణ‌యంతో వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌ని అంటున్నారు మేధావులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News