రైనా ఇష్యూ.. ఇన్ని ట్విస్టులేంటి బాబోయ్

Update: 2020-09-01 00:30 GMT
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు, ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఆడే సురేష్ రైనా.. అనూహ్యంగా ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డం, యూఏఈ నుంచి స్వ‌దేశానికి ప‌య‌నం కావ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని, క‌ట్టుదిట్ట‌మైన నిబంధ‌న‌లు పాటిస్తూ ఎంతో క‌ష్ట‌ప‌డి దుబాయ్‌కు వెళ్లిన రైనా.. ఇలా టోర్నీ ఆరంభం కాక‌ముందే ఇంటిముఖం ప‌డ‌తాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రైనా టోర్నీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఐతే ఆ కార‌ణాలేంట‌నే విష‌యంలో రోజుకో క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌స్తోంది.

ముందేమో.. ఈ నెల 19న త‌న మేన‌త్త ఆశాదేవి ఇంటిపై దుండ‌గులు దాడి చేయ‌డం, ఆ దాడిలో త‌న మావ‌య్య మ‌ర‌ణించ‌డం, అత్త‌కు తీవ్ర గాయాలై ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ బాధ‌తోనే రైనా ఇంటికి వ‌చ్చేస్తున్నాడ‌ని వార్తొచ్చాయి. కానీ త‌ర్వాత క‌రోనా భ‌యంతో, బ‌యో బ‌బుల్ నిబంధ‌న‌లు పాటించ‌లేక‌, ఒంట‌రిత‌నంతో, మాన‌సిక స్థితి స‌రిగా లేకే రైనా స్వ‌దేశానికి వ‌స్తున్నాడ‌న్నారు. ఆ త‌ర్వాత ఇంకో క‌థ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. జ‌ట్టు యాజ‌మాన్యం త‌న‌కు బాల్క‌నీ లేని మామూలు గ‌ది కేటాయించ‌డంతో రైనాకు కోపం వ‌చ్చింద‌ని.. ఈ విష‌యంలో ఫ్రాంచైజీ ప్ర‌తినిధుల‌తో గొడ‌వ జ‌రిగి అత‌ను టోర్నీ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని వార్తలొచ్చాయి. మ‌రోవైపు చెన్నై య‌జ‌మాని శ్రీనివాస‌న్ సైతం.. రైనాను ఉద్దేశించి నెగెటివ్ కామెంట్లు చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

కానీ మ‌రి కొన్ని గంట‌ల్లోనే క‌థ మారిపోయింది. తాను రైనానుద్దేశించి ప్ర‌తికూలంగా ఏమీ అన‌లేద‌ని.. అత‌ను త‌మ జ‌ట్టు కోసం ఎంతో చేశాడ‌ని.. క‌ష్ట‌కాలంలో ఉన్న అత‌డికి సీఎస్కే అండ‌గా నిలుస్తుంద‌ని.. ఈ టైంలో అత‌డికి విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని మ‌రో మీడియా సంస్థ‌తో అన్నాడు శ్రీనివాసన్. ఇలా రోజుకో క‌థ‌నం వ‌స్తుండ‌టంతో రైనా నిష్క్ర‌మ‌ణ‌కు అస‌లు కార‌ణం ఏంట‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త రావ‌ట్లేదు.
Tags:    

Similar News