ఈ శతాబ్దపు ప్రేమ కథ.. కోటను.. కోట్లను వదిలేసిన రాకుమారి

Update: 2021-10-26 10:45 GMT
ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ప్రేమ కోసం రాజకోటను.. కోట్లాది రూపాయిల్ని వదిలేసిన జపాన్ రాకుమారి తాజాగా బయటకు వచ్చేశారు. అంబరాన్ని అంటే వేడుకల్ని వదులుకొని సామాన్యుడితో జీవితాన్ని సామాన్యంగా గడిపేందుకు సిద్ధమైన జపాన్ రాకుమారి మకో తాజాగా రాజసౌధాన్ని వదిలేసి బయటకు వచ్చేసింది. మకో - కిమురోల పెళ్లిని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ సైతం అధికారికంగా ధ్రువీకరించింది. వీరి పెళ్లికి మెజార్టీ జపనీయుల నుంచి వ్యతిరేకత రావటంతో ప్యాలెస్ లోపల ఎలాంటి వేడుకల్ని నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు ప్రకటించారు. ఇంటికి వచ్చే ముందు మాత్రం రాకుమారి మకో.. తన పేరెంట్స్ ను సోదరిని హత్తుకొని ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది.

జపాన్ చక్రవర్తి నరుహిటోతమ్ముడు అకిషినో కుమార్తే ‘మకో’. టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ వర్సిటీలో చదువుకునే వేళలో సామాన్యుడైన కొమురోను ఇష్టపడి ప్రేమలో పడ్డారు. వాస్తవానికి వీరి పెళ్లి 2017లోనే జరగాల్సి ఉంది. అయితే.. ఆర్థిక వివాదాల కారణంగా వారి పెళ్లి అప్పట్లో క్యాన్సిల్ అయ్యింది. అనంతరం కొమురో ఉన్నత చదువుల కోసం న్యూయార్కుకు వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు జపాన్ వంక చూడలేదు. దీంతో ఆమె మాత్రం కోటకే పరిమితమయ్యారు. గత నెలలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న కొమురో స్వదేశానికి వచ్చారు.

జపాన్ రాజ కుటుంబానికి చెందిన మహిళలు సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే వారు తమ రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు సైతం మకో సిద్ధపడ్డారు. రాజభరణం కింద తనకు వచ్చే రూ.10కోట్ల మొత్తాన్ని సైతం తీసుకోవటానికి ఆమె ఇష్టపడలేదు. అంతేకాదు.. సంప్రదాయం ప్రకారం వేడుకల్ని నిర్వహించాలని భావించారు కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో అలాంటివేమీ చేయలేదు. కాకుంటే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లుగా మాత్రం అధికారిక పత్రాల్ని విడుదల చేశారు. చివరగా రాజ ప్రసాదాన్ని వదిలేసిన మకో.. తాను ప్రేమించిన సామాన్యుడి కోసం రాజకోటను వదిలేసి బయటకు వచ్చేశారు. ఈ శతాబ్దంలోని అరుదైన ప్రేమకథల్లో ఇదొకటిగా మిగిలిపోతుందన్న మాట వినిపిస్తోంది. ఈ జంట జపాన్ ను విడిచి పెట్టి అమెరికాలో సెటిల్ అవుతారని చెబుతున్నారు. వీరిద్దరూ కలకలం కలిసి ఉండాలని ఆశిద్దాం
Tags:    

Similar News