చివరి ఎన్నికలు ఎవరికి... ?

Update: 2022-02-21 16:30 GMT
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. రెండేళ్ళకు పైగా సార్వత్రిక ఎన్నికలకు టైమ్ ఉన్నా కూడా మాటల తూటాలు అటూ ఇటూ గట్టిగానే పేలుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రతీ ఎన్నికా రాజకీయ పార్టీలకు అతి ముఖ్యమే. ప్రాణ సమానమే. ఆ మాటకు వస్తే 2019 ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివి అని అంతా భావించారు. దానికి కారణం అప్పటికి ఒక ఎన్నికలో ఓడిపోయిన వైసీపీ తన సర్వశక్తులూ ఉపయోగించి మరీ 2019లో పోటీకి దిగింది.

ఆ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలిస్తే కనుక వైసీపీ పని అయిపోయినట్లే అని కూడా నాడు విశేషణలు వచ్చాయి. దేవుడి దయ వల్ల వైసీపీ ఆ గండం నుంచి గట్టెక్కేసింది. టీడీపీ ఓడింది. ఆ ఓటమి కూడా దారుణమైనది. దాంతో టీడీపీ భవిష్యత్తు మీద నాటి నుంచే చర్చలు మొదలయ్యాయి. దీనికి కారణం చంద్రబాబు వంటి లీడర్ ఉన్నా ఆయనకు ఉన్న వయోభారం, వారసుడి మీద నమ్మకం లేకపోవడం వంటివే అని అంటారు.

ఇక ఇపుడు 2024 కి గడువు దగ్గర పడుతున్న వేళ ఈ తరహా ప్రచారం మరింతగా ఊపందుకుంది. ఏపీలో చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీగానే 2024 ఎన్నికలను చెప్పుకుంటున్నారు. ఏపీలో మూడవ పార్టీలు కానీ కూటములు కానీ పెద్దగా ప్రభావం చూపించే సీన్ ఈ రోజుకు అయితే లేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరికి విజయావకాశాలు ఎక్కువ అన్న దాని మీద కూడా వేడిగా చర్చ సాగుతోంది.

మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. 2024లోనూ జగన్ గెలిచి మళ్లీ సీఎం అవుతారు అని ఆయన అంటున్నారు. ఇది పక్కా రాసుకోండి అని సవాల్ కూడా విసురుతున్నారు. మేము గెలిచి తీరుతాం, అదే టైమ్ లో ఒంటరిగా కూడా ఎన్నికలను ఎదుర్కొంటామని ఆయన అంటున్నారు. అదే టీడీపీకి సింగిల్ గా పోటీ చేసే సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ పొత్తులతోనే రావాలి తప్ప ఒంటరి పోరు చేసే సీన్ లేదని కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇక టీడీపీలో నాయకత్వ సంక్షోభం ఉందని కూడా ఆయన అంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు తమ సొంత పార్టీ గురించి ఆలోచించుకోకుండా వైసీపీ మీద విమర్శలు చేయడం కంటే దారుణం మరోటి లేదని కూడా అనిల్ అంటున్నారు.

మొత్తానికి మంత్రి గారి కామెంట్స్ ఇలా ఉంటే విజయసాయిరెడ్డి వంటి వారు టీడీపీకి ఎపుడూ ఎటాక్స్ ఇస్తూనే ఉంటారు. ఆయన తాజాగా ట్వీట్లు చేస్తూ ఏపీలో 2024లో జరిగే ఎన్నికలు టీడీపీకి చిట్ట చివరివి కాబోతున్నాయని తేల్చేశారు. ఆ ఎన్నికల తరువాత టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని కూడా చెప్పేశారు. టీడీపీ పరిస్థితి మీద ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

నిజంగా ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ జాతకం మారిపోతుందా, చరిత్ర పుటలలోనే మిగిలిపోతుందా అన్న చర్చ కూడా వస్తోంది. నిజానికి చంద్రబాబుకు 2024 నాటికి 74 ఏళ్ళు నిండిపోతాయి. అదే టైమ్ లో పార్టీ కనుక ఒకవేళ ఓడిపోతే 2029 ఎన్నికలు ఎటూ ఉన్నాయి కదా. అప్పటికి బాబు ఎనభయ్యేళ్లకు చేరువ అయినా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే మళ్లీ రాజకీయం ఊపు అందుకోకుండా ఉంటుందా.

ఇక లోకేష్ సమర్ధత మీద విపక్షాలు విమర్శలు ఎలా ఉన్నా ఆయన నానాటికీ రాటుదేలుతున్నాడు అన్నది నిజం. 2024లో నిజంగా పార్టీ ఓడితే చంద్రబాబు కంటే ముందు లోకేష్ బయటకు వచ్చి గట్టిగా పోరాడుతారు, ఇపుడు తండ్రి చాటు బిడ్డగా ఉన్నా రేపటి రోజున ఆయన సొంతంగా సత్తా చాటే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇక ప్రజలు ఎపుడూ ఆల్టర్నేషన్ కోరుకుంటారు. ఒకే పార్టీ అన్నది ప్రజాస్వామ్యంలో కుదిరే వ్యవహారం కాదు, అలా కనుక చూసుకుంటే టీడీపీకే కాదు, ఏ పార్టీకి చివరి ఎన్నికలు అంటూ ఉండవు, దమ్ముండి పోరాడితే విజయం ఈ రోజు కాకపోయినా రేపు అయినా దక్కుతుంది అన్నది వాస్తవం.
Tags:    

Similar News