టీకా కంపెనీల ‘ఇండెమ్నిటీ’ డిమాండ్ కు మోడీ సర్కార్ ఓకే

Update: 2021-06-03 03:45 GMT
మీరేదైనా వస్తువును కొన్నారు. ఇంటికి తీసుకెళ్లి వాడిన తర్వాత మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసిందనుకోండి. మీరప్పుడు ఏం చేస్తారు? నష్టపరిహారాన్ని కోరతారు. సదరు కంపెనీ మాట వినకుంటే కోర్టుకు ఎక్కుతారు. చిన్న వస్తువులకే ఇలాంటి చట్టపరమైన రక్షణ ఉన్నప్పుడు కొవిడ్ టీకాల విషయం మరెంత కఠినంగా ఉండాలి? కానీ.. కొన్ని టీకా కంపెనీలు వ్యాక్సిన్ కారణంగా ఎవరికైనా.. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. తమకు సంబంధం లేదని.. అందుకు సంబంధించి ఎలాంటి పరిహారం ఇవ్వమని స్పష్టం చేస్తున్నాయి.

ఇలాంటి తీరును తప్పు పడుతూ.. అదెలా కుదురుతుందని నిలదీయాల్సి ఉన్నా.. ఇప్పటికే పాతిక దేశాలు టీకా కంపెనీలు కోరుతున్న ఇండెమ్నిటికి ఒప్పుకున్నట్లుగా చెబుతారు. అలా ఓకే చేసిన దేశాల్లో అమెరికా.. యూరోపియన్ యూనియన్.. జపాన్.. కెనడా.. అర్జెంటీనా లాంటి దేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా ఇండెమ్నిటీ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

టీకా కంపెనీల డిమాండ్ కు తలొగ్గింది. దేశంలో తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఉన్న వేళ.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా కొత్త వ్యాక్సిన్లకు ఓకే చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా.. టీకా కంపెనీలు కోరుతున్నట్లే ఇండెమ్నిటీ విధానానికి ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో.. వ్యాక్సినేషన్ లో ఏదైనా సమస్యలు ఏర్పిడితే.. కంపెనీలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. మొత్తం ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇది మాత్రమే కాదు.. తాజాగా మెడెర్నా.. ఫైజర్ టీకాలకు కేంద్రం ఓకే చెప్పింది. అదే సమయంలో ఇప్పటివరకు టీకా విధానంలో అనుసరిస్తున్న విధానాల్లో కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు భారత్ లో పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిబందనల్లో మార్పులు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన టీకాలకు దేశంలో బ్రిడ్జ్ ట్రయల్స్ చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. మొత్తానికి వ్యాక్సినేషన్ ను మరింత వేగంగా జరపటానికి.. కేంద్రంలోని మోడీ సర్కారు దేనికైనా రెఢీ అన్నట్లుగా తాజాగా తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే అర్థం కాక మానదు.
Tags:    

Similar News