పెళ్లైన పది రోజులకే కొత్త పెళ్లి కూతురు అలా చేసింది.. అయినా కేసు పెట్టమంటున్నారు

Update: 2021-10-19 03:47 GMT
పెళ్లైన పది రోజులకే కొత్త పెళ్లి కూతురు అత్తారింటి నుంచి పారిపోయిన ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇదేం పెద్ద విషయమా? ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయన్న మాట రావొచ్చు. కానీ.. ఈ ఉదంతం అలాంటిది కాదు. మనం ఊహించని కొత్త కోణం బయటకు రావటమే కాదు.. పోలీసుల్ని సైతం అవాక్కు అయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ వాటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో కొత్తగా పెళ్లైన పెళ్లి కుమార్తె అత్తారింటి కుటుంబ సభ్యుల ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే తన దారిన తాను వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే.. ఇరుగుపొరుగు వారు ఇంటికి రావటం.. ఇంట్లోని వారంతా పడిపోయి ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పి.. జైపూర్ లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు. దీంతో వారిని అక్కడకు తరలించారు. విషయం పోలీసులకు చేరింది. వారు రంగంలోకి దిగారు. తర్వాతి రోజు ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్పృహ వచ్చింది. అసలేం జరిగిందని పోలీసులు అడగ్గా.. తమ ఇంట్లో పెళ్లి జరిగిందని.. కొత్త పెళ్లికుమార్తె తాము తిన్న ఆహారంలో ఏదో కలిపి ఇచ్చిందని.. దాంతో తాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు చెప్పారు.

దీంతో.. పెళ్లి కుమార్తె వివరాలు సేకరించి.. ఆమె కోసం వెతకటం షురూ చేశారు. పోలీసుల గాలింపులో జైపూర్ లోని ఒక పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పదంగా ఒక మహిళ కనిపించటంతో ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సదరు యువతి.. కొత్త పెళ్లి కుమార్తె ఒకరేనని తేలింది. ఇంట్లోని వారు తినే ఆహారంలో మత్తు మందు కలిపింది కూడా తానేనని పేర్కొంది. ఆమెతో ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా.. అందులో బట్టలు మాత్రమే ఉన్నాయి తప్పించి ఇంకేమీ లేవు.

ఎందుకిలా చేశావని పోలీసులు ప్రశ్నించగా.. దిమ్మ తిరిగే వాస్తవాల్ని వెల్లడించింది. తమది బిహార్ లోని ఛాప్రా అని.. తన తల్లిదండ్రులు చాలా పేదవాళ్లని.. తనను పెళ్లి చేసుకొని రాజస్థాన్ తీసుకొచ్చారని పేర్కొంది. తనను తన తల్లిదండ్రులు రాజస్థాన్ వారికి అమ్మేశారని.. అత్తారింటికి వచ్చాక తన భర్త తాగుబోతని.. రోజూ బాగా కొట్టేవాడని అందుకే తాను పారిపోయినట్లు చెప్పింది. ఆమె చెప్పిన వివరాలపై సందేహాలు వచ్చిన పోలీసులు క్రాస్ చెక్ చేశారు. ఆశ్చర్యకరంగా ఆమె చెప్పిందంతా నిజమని తేలింది. అత్తారింటి వారి తరఫు వారు ఆమెపై కేసు పెట్టటానికి కూడా ఇష్టపడటం లేదు. కారణం... తాము ఆ అమ్మాయిని బిహార్ నుంచి కొనుక్కొచ్చినట్లుగా బయటకు వస్తే కొత్త తలనొప్పులు ఎదురవుతాయన్న ఆలోచనతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. చివరకు.. ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.




Tags:    

Similar News