గ్యాంగ్‌స్టర్స్‌ ను గడగడలాడించిన ఆ అధికారి వెళ్లిపోయారు

Update: 2022-01-24 05:30 GMT
రీల్ లో చెలరేగిపోయే హీరోకు ఏ మాత్రం తీసిపోని రియల్ హీరో కథ ఇది. కొమ్ములు తిరిగిన గ్యాంగ్‌స్టర్స్‌కు సింహస్వప్నంగా మారి.. తాజాగా కంటికి కనిపించని కరోనా మహమ్మారి దెబ్బకు ఆయన అనారోగ్యం దెబ్బతింది. అనంతరం కోలుకున్నా.. తర్వాత వచ్చిన ఆనారోగ్య సమస్యలతో తాజాగా తుదిశ్వాస విడిచిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి గురించి తెలుసుకోవాల్సిందే. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా.. గ్యాంగ్‌స్టర్స్‌కు సింహస్వప్నంగా.. ఆయన పేరు చెబితే నేరస్తులు గడగడలాడేలా వ్యవహరించిన సదరు మాజీ ఐపీఎస్ అధికారి పేరు ఏఏ ఖాన్. 1963 బ్యాచ్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి గురించి డిపార్టు మెంట్లో కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే.. ఆయన చేపట్టిన ఆపరేషన్లు అలాంటివి. ముంబయి.. గుజరాత్ లలో ఎన్నో ఎన్ కౌంటర్లలో ఆయన హస్తం ఉంది.
 
1963 బ్యాచ్ కు చెందిన ఏఏ ఖాన్ 1997లో రిటైర్ అయ్యారు. 1991లో ముంబయిలోని స్వాతి బిల్డింగ్ లో గ్యాంగ్ స్టార్ మయా డోలస్ ఎన్ కౌంటర్.. అదేఏడాది గుజరాత్ లోని వడోదరలో ఆపరేషన్ బరోడా ఎన్ కౌంటర్ తో ఏఏ ఖాన్ పేరు దేశ మంతా మార్మోగింది. ఆయన చేపట్టిన ఎన్ కౌంటర్ ను స్ఫూర్తిగా తీసుకొని.. బాలీవుడ్ లో హిట్ మూవీ అయిన.. ‘‘షూట్ వుట్ ఎట్ లోఖండవాలా’’ పేరుతో రావటం తెలిసిందే. ఇందులో ఏఏ ఖాన్ పాత్రను సంజయ్ దత్ నటించారు.

 చాలామంది ఐపీఎస్ అధికారులకు భిన్నంగా ఏఏ ఖాన్ వ్యవహరించేవారు. ఆయన తన టీంకు ఆదేశాల్ని జారీ చేసి.. తాను ఏసీ రూంలోకి వెళ్లి రిలాక్స్ కావటం.. టీం చేసిన పనిని సమీక్షించటం కాకుండా.. నేరుగా సీన్లోకే వెళ్లే రకం. అచ్చం సినిమాల్లో మాదిరి ఆయన తీరు ఉంటుందని చెబుతారు. 1991 నవంబరు 16న ఏఏ ఖాన్ ఆధ్వర్యంలో స్వాతి బిల్డింగ్ ఎన్ కౌంటర్ ఎపిసోడ్ రీల్ స్థాయికి ఏ మాత్రం తీసిపోదని చెబుతారు. అంటేకాదు.. ముంబయిలోని లోఖండవాలాలో జరిగిన ఆపరేషన్ లో ఆయన ఏకంగా 100 మంది పోలీసు టీంను లీడ్ చేస్తూ.. ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేయటం గమనార్హం.

దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో గ్యాంగస్టర్స్ మయా డోలస్.. దిలీప్ బుహ.. మరో ఐదుగురు క్రిమినల్స్ ను ఖతం చేయటం గమనార్హం. అదే ఏడాది గుజరాత్ లోని వడోదరలోనూ ‘ఆపరేషన్ బరోడా’ ఎన్ కౌంటర్ ను చేపట్టారు. ఈ ఆపరేషన్ లో అప్పటి ఖలీస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ బల్డియో సింగ్ సైనీతో పాటు మరో నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. అంతేకాదు.. 1992లో ముంబయిలోని ములుంద్ లో చేపట్టిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారు.

అంతేకాదు.. అప్పట్లో హర్యానా ముఖ్యమంత్రిపై కాల్పులు జరిపిన ఉగ్రవాది మన్ జిత్ సింగ్ ను ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్ లో అరెస్టు చేసింది కూడా ఖాన్ టీమే. ఇప్పుడు అనేక సినిమాలు.. ఓటీటీ ఫ్లాట్ ఫాంకు కథా వస్తువుగా మారిన మహారాష్ట్ర ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్)కు ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆయనే. అటు మాఫియా గ్యాంగుల్నే కాదు.. ఇటు ఉగ్రవాదులను కూడా ముట్టుబెట్టిన ఏఏఖాన్.. తన 81 ఏళ్ల ముదిమి వయసులో కరోనా బారిన పడటం.. ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఎదురైన అనారోగ్య  సమస్యలతో ఆయన మరణించారు.
Tags:    

Similar News