ఏపీలో కరోనాపై సమరానికి ప్లాన్ సిద్ధమైంది

Update: 2020-03-23 23:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కంట్రోల్ చేసేందుకు ఎవరికి వారు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు తక్కువే. తెలంగాణలో కరోనా స్టేజ్ టులోకి వెళితే.. ఏపీలో మాత్రం ఇప్పటికి స్టేజ్ వన్ లోనే ఉంది. ఇలాంటివేళలోనే.. అప్రమత్తంగా వ్యవహరించి కరోనా వైరస్ గొలుసును బ్రేక్ చేయటం తేలిక అవుతుంది. చాలాచోట్ల కరోనా స్టేజ్ టు నుంచి త్రీ వెళ్లే సమయంలో కళ్లు తెరవటం.. హడావుడి చర్యలు తీసుకోవటం కనిపిస్తుంది. కానీ.. దీని కారణంగా జరిగే నష్టం భారీగా ఉంటుంది.

ఈ విషయంలో ఏపీ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. స్టేజ్ వన్ లోనే టూలో తీసుకోవాల్సిన చర్యల్ని తెర మీదకు తీసుకొచ్చేసింది. స్టేజ్ వన్ లోనే ఈ వైరస్ ను నిలిపివేయాలని.. ఎట్టి పరిస్థితుల్లో తర్వాతి స్టేజ్ లోకి రాకుండా అడ్డుకోవాలన్న ఆలోచనలో ఏపీ అధికారులు ఉన్నారు. ఇందుకోసం వార్ ప్లాన్ ను సిద్ధం చేశారు.

ఏపీలో నెలకొన్న సానుకూల అంశం ఏమంటే.. ఇప్పటివరకూ నమోదైన అన్ని పాజిటివ్ కేసులన్ని విదేశాల నుంచి వచ్చినవి కావటం. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాకపోకల్ని నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవటం వల్ల.. రాష్ట్రంలోని కొత్తగా వచ్చే విదేశీ ప్రయాణికులు దాదాపుగా ఉండనట్లే. గడిచిన నాలుగైదు రోజుల్లో దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో దిగి.. గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే తప్పించి.. ఇప్పటికైతే కొత్తగా వచ్చే వారితో వ్యాపించే వైరస్ ఉండదనే చెప్పాలి. దీంతో.. ఇప్పటికే ఉన్న వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. వైరస్ పీచమణచటం పెద్ద కష్టమైన పనిగా ఉండదంటున్నారు.

గడిచిన కొద్ది రోజులుగా విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారు 13వేల మంది వరకూ ఉంటారు. వారిలో ఆరు వేల మందికి ఈ నెల 29 నాటికి పద్నాలుగు రోజులు గడువు ముగుస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారు పద్నాలుగురోజులు క్వారంటైన్ లో ఉన్నట్లైతే.. కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారందరి గడువు ఏప్రిల్ మూడుతో ముగుస్తుంది. ఈ గడువు లోపు వరకూ జాగ్రత్తగా ఉండటం.. విదేశాల నుంచి వచ్చిన వారందరి బాగోగులు.. ఆరోగ్య పరిస్థితి మీద డేగ కన్ను వేయటం ఒక ఎత్తు అయితే.. అలాంటి వారిలో ఎవరికైనా పాజిటివ్ కేసులు వస్తే.. వారి చుట్టూ ఉన్న వారిని పరీక్షలు జరపటం లాంటి వాటిని సిద్ధం చేశారు.

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు సెల్ప్ క్వారంటైన్ లో ఉండగలిగితే.. ఏపీకి కరోనా ముప్పు తప్పినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చిన 13 వేల మందిలో ఇటలీ.. ఫ్రాన్స్.. స్పెయిన్.. అమెరికా.. చైనాలాంటి కరోనా హైరిస్క్ దేశాల నునంచి వచ్చిన ప్రయాణికుల మీద ఒక కన్నేయటం.. అలాంటి వారి కారణంగా వైరస్ వ్యాప్తి జరగకుండా చూసుకోవటంలో అధికారులు నిమగ్నమయ్యారు. హైరిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. తమ స్వస్థలాలకు వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై ప్రభుత్వం ఇప్పుడో కన్నేసింది. అలాంటి వారిని గుర్తించి క్వారంటైన్ చేయటం.. అందుకు సహకరించని వారిని నిర్బంధంగా అయినా క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పలు చర్యలు చేపట్టారు. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News