అనుకున్న‌ది సాధించిన ఆనంద‌య్య‌.. ఇంట్ర‌స్టింగ్‌!

Update: 2021-06-21 17:30 GMT
ఆనందయ్య‌!  అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ప్ర‌చారం పొందిన నెల్లూరు జిల్లా కృష్ణ‌పట్నం ప్రాంతానికి చెందిన‌ వ్య‌క్తి. కేవ‌లం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే దేశం మొత్తం ఆయ‌న వైపు చూసింది. అంతేకాదు.. ఉప‌రాష్ట్ర‌ప‌తి నుంచి కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు... ఆయ‌న విష‌యాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించారు. దీనికి కార‌ణం.. ప్రాణాంత‌కంగా ప‌రిణ‌మించిన క‌రోనాను నియంత్రించేందుకు ఆయ‌న రూపొందించిన మందే ఆనంద‌య్య పేరును కొన్ని రోజుల పాటు హ‌ల్‌చ‌ల్ చేసేలా చేసింది. అయితే.. దీనిపై వివాదం రావ‌డం.. ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డం త‌ర్వాత‌.. కోర్టు జోక్యంతో స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఆనంద‌య్య మందును త‌యారు చేస్తున్నారు. రోజుకు వేల‌ల్లో మందును అందిస్తున్నారు. ఇదిలావుంటే, కృష్ణపట్నం ఆనందయ్యకు తమ సంస్థ ద్వారా త్వరలో వరల్డ్‌బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు  ఐబీపీ రాష్ట్ర కార్యదర్శి దినవహి వెంకటనాగరాజ ప్రసాద్ తాజాగా ప్రకటించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలుకు వచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఆయన కలిసి సన్మానించారు.  కరోనా నివారణకు మందు కనిపెట్టి ఆనందయ్య చేస్తున్న సేవలను ఐబీపీ గుర్తించిందన్నారు. త్వరలోనే ఆనందయ్యకు లండన్‌ నుంచి రానున్న అవార్డులను నెల్లూరులో అందజేయనున్నట్లు తెలిపారు.

క‌రోనా విష‌యంలో అంద‌రూ ఆవేద‌న చెందుతున్న స‌మ‌యంలో ఆనంద‌య్య మందు ఒకింత ఉప‌శ‌మ‌నం క‌లిగించింద‌ని.. పేర్కొన్నారు. అయితే.. ఇక్కడ కొస‌మెరుపు ఏంటంటే.. ఆనంద‌య్య త‌న మందును త‌యారు చేసేందుకు ప్ర‌భుత్వం నుంచి సాయం కోరుతూ.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌రాశారు. ప్రస్తుతం ప్ర‌పంచ రికార్డు ఆయ‌న‌ను వెతుక్కుంటూ రావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News