ప్రేమించుకోవడానికి సెలవులు ఇస్తున్న కంపెనీలు

Update: 2019-01-26 01:30 GMT
ఉద్యోగం ఎలాంటిదైనా ఒక్క రోజు సెలవు దొరకాలంటే చాలా కష్టం. ముఖ్యంగా కొన్ని సంస్థలు ఉద్యోగస్తులు సెలవులు పెడితే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఎంతో పెద్ద అవసరమైతే తప్ప సెలవులు ఇచ్చేందుకు ఒప్పుకోరు. అందుకే ఏదైనా పని ఉంటే బందువులు చనిపోయారు, వారికి బాగాలేదు, వీరికి బాగాలేదు అంటూ సెలవులు తీసుకుంటూ ఉంటారు. ఇక ప్రేమలో ఉన్న వారు సెలవుల కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లవర్‌ తో ఏదైనా ప్లాన్‌ చేసుకుంటూ సెలవు కోసం నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. కాని చైనాలోని ఆ రెండు కంపెనీల్లో లవ్‌ చేసుకోవడానికి ఇబ్బంది అస్సలు అక్కర్లేదు. సెలవులు వారే ఇస్తున్నారు. అది కూడా జీతంతో కూడిన సెలవులు.

చైనాలోని హాంగ్‌ ఝె టూరిస్టు పార్క్‌ లో ఉండే ఈ రెండు కంపెనీలు కూడా తమ సంస్థల్లో పని చేసే వారు ఎవరైనా ప్రేమలో ఉంటే, డేటింగ్‌ చేసేందుకు వెళ్లాలనుకుంటే వెంటనే పర్మిషన్‌ ఇస్తారు. 8 రోజుల పాటు జీతంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ కావాలని అడిగితే కూడా వెంటనే సెలవులు మంజూరు చేస్తున్నారు. డేటింగ్‌ కోసం ఎన్ని రోజులు వెళ్లాలనుకుంటే అన్ని రోజులు కూడా సెలవులు తీసుకోవచ్చు అంటూ సదరు కంపెనీలు ప్రకటించాయి. అయితే ఇక్కడ ఒక చిన్న కండీషన్‌ ఉంది. అదే అమ్మాయి అయ్యి ఉండాలి, 30 ఏళ్లు పైబడి ఉండాలి.

30 ఏళ్లు పైబడి, పెళ్లి కాని వారి కోసం ఆ కంపెనీలు ఈ ఆఫర్‌ ను ప్రకటించాయి. చైనాలో ఎక్కువ శాతం అమ్మాయిలు వర్క్‌ లో పడి, కెరీర్‌ పై దృష్టితో పెళ్లి పై ఆసక్తి చూపడం లేదు. ప్రేమ, పెళ్లి లేకుండా ఉండే అమ్మాయిల సంఖ్య చైనాలో చాలా ఎక్కువగా పెరిగి పోతుంది. అందుకే తమ వంతు బాధ్యతగా అన్నట్లుగా 30 ఏళ్లు దాటిన అమ్మాయిలకు లవ్‌ హాలీడేస్‌ ను ఇస్తున్నట్లుగా సదరు కంపెనీల యాజమాన్యం ప్రకటించింది. చైనాలో కంపెనీలు తమ ఉద్యోగులతో ఎంతగా పని చేయించుకుంటారో, వారి పట్ల అంతా బాధ్యతగా ఉంటారని ఈ సంగటనతో మరో సారి నిరూపితం అయ్యింది.
    
 
Tags:    

Similar News