స‌రోగ‌సీ త‌ల్లుల‌పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇదే!

Update: 2022-07-14 15:13 GMT
సరోగసీ (అద్దె గ‌ర్భం) ద్వారా బిడ్డను తీసుకున్న తల్లికి సైతం మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాల్సిందేన‌ని ఏపీ హైకోర్టు విస్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు హైస్కూల్‌‎లో పని చేసే ఒక‌ టీచర్ త‌న‌కు మెటర్నిటీ లీవ్‌ ఇవ్వకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త‌న‌కు మాతృత్వ‌పు సెల‌వులు మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వేరే మ‌హిళ ద్వారా బిడ్డ‌ను క‌న్న త‌ల్లుల‌కు సైతం మెటర్నిటీ లీవులు ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సరోగసీ (అద్దె గ‌ర్భం) ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ఆ బిడ్డను క‌న‌డానికి అండం ఇచ్చిన తల్లికీ మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది.  

అలాగే బిడ్డను పెంచేందుకు తల్లికి మూడు నెలల పాటు మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాలని హైకోర్టు అధికారుల‌ను ఆదేశించింది. మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 2017కు తెచ్చిన సవరణల ప్ర‌కారం ఆ టీచ‌ర్ కు మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అద్దె గ‌ర్భం విధానంలో వేరే మ‌హిళ‌ల ద్వారా బిడ్డ‌ను క‌న్న త‌ల్లుల‌కు ఊర‌ట ల‌భించింది.

గత ఏడాది మార్చిలో ఇదే విష‌యంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా ఉద్యోగి సరోగసీ ద్వారా తల్లి అయినప్పటికీ ప్రసూతి సెలవులను తిరస్కరించలేమని పేర్కొంది. స‌హ‌జ ప‌ద్ధ‌తిలో త‌ల్లి కానంత మాత్రాన ప్ర‌సూతి సెల‌వుల‌ను తిరస్క‌రించ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News