ఢిల్లీలో 11మంది మృతి:భీతిగొలిపే నిజాలివీ

Update: 2018-07-02 06:55 GMT
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది మృతి.. అంతా ఒక కుటుంబానికి చెందిన వారే.. చేతులు కట్టి నోటికి దుస్తులు చుట్టి ఏడుగురిని ఉరివేశారు. మరో వృద్ధురాలి గొంతుకోసి చంపేశారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు - ఏడుగురు మహిళలు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇంతమంది ఒకే రోజు చనిపోవడంతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనమైంది. వీరి మరణానికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. వారెందుకు చనిపోయారో కూడా నిన్నటి వరకూ తెలియరాలేదు. కానీ నేడు పోలీసుల విచారణలో  నిజం బయటపడింది.

దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు కనిపించాయి. పాలవాడు ఉదయం వచ్చి చూసేసరికి నిజం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని చిత్తోడ్ గఢ్ కు చెందిన నారాయణ్ దేవ్ (75) - ప్రతిభా దేవి(60) లు ఇరవై రెండేళ్ల క్రితం ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని సంతనగర్ కు వచ్చి స్థిరపడ్డారు. ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతూ ఫ్లైవుడ్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు భవనేష్ భాటియా - లలిత్ భాటియా - కూతురు ప్రియాంక ఉన్నారు. వీరి సంతానంగా  పెద్ద కొడుకుకు ముగ్గురు పిల్లలు - చిన్న కొడుకుకు ఒక కొడుకు ఉన్నారు. ఈ 11 మంది ఒకే ఇంట్లో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు.

శనివారం రాత్రి 11.45 నిమిషాలకు కిరాణా షాప్ కట్టేసి పైన ఉంటున్న ఇంట్లోకి చేరుకున్నారు.  ఆ రాత్రే అందరూ చనిపోయారు. పోలీసులు ఈ మృతిపై ఇల్లంతా వెతకగా కొన్ని కాగితాలు బయటపడ్డాయి. ‘చావడానికి మీరు బల్లను ఉపయోగిస్తే మీ చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి.. కళ్లు మూసుకోండి.. అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది’ అని రాసి ఉన్న చీటీలు దొరికాయి. దీన్ని బట్టి వీరంతా తాంత్రిక మంత్రాలను నమ్మి మూఢనమ్మకంతో ఆత్మహత్య చేసుకున్నారని తేలింది.

ఇంటిసభ్యుల్లోని ముగ్గురు తాంత్రిక పూజలు చేస్తున్నారని.. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యి అంతలోనే ఏమైందో కానీ ఇంటిసభ్యులందరినీ చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్టు పోలీసులు ప్రాథమిక విచారణ తేల్చారు.  శనివారం రాత్రి ఆహారంలో మత్తుమందు కలిపి.. అందరూ మత్తులోకి వెళ్లాక  వారిని చంపేసి ఉంటారని.. మధ్యలో ఇంట్లోని వృద్ధురాలు నానమ్మ నారాయనదేవికి మెలకువ రావడంతో ఆమెను గొంతుకోసి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఈ కుటుంబానికి సమీప బంధువులు మాత్రం ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ దోపిడీ చాయలు లేకపోవడం.. వారికి శత్రువులు కూడా లేకపోవడంతో ఇదీ ముమ్మాటికి తాంత్రిక పూజల వల్లే ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News