మూడేళ్ల పాల‌న‌..పెద‌వి విరుపులే ఎక్కువ బాబు

Update: 2017-06-09 04:33 GMT
మూడేళ్ల పాల‌న‌... ఒక ప‌రిపాల‌కుడికి త‌న పాల‌న‌లో మూడేళ్లు గ‌డ‌వ‌డం అంటే ఒక‌ర‌కంగా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డమే. ప్ర‌జ‌లు ఆ పాల‌కుడి ఏలుబ‌డిపై ఒక అంచనాకు రావ‌డ‌మే. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పరిపాల‌న‌పై - ఆయ‌న పాల‌నలోని సానుకూల‌ - వ్య‌తిరేక కామెంట్ల‌పై విశ్లేష‌ణ ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప‌రిపాల‌న‌ను మెచ్చే వ‌ర్గాల భావ‌న ప్ర‌కారం ఏపీ సీఎం న‌వ్యాంధ్ర కేంద్రంగా భవిష్యత్‌ పాలనకు పునాదులేసుకుంటున్నారు. ఏపీకి కీల‌క‌మైన‌ హోదానిచ్చేందుకు కేంద్రం అంగీకరించక అంతకుమించిన ప్రయోజనాల్తో కూడిన ప్యాకేజీని ప్రకటించడంతో త‌ప్ప‌నిస‌రి అయి ఒప్పుకున్నార‌ని చెప్తున్నారు. గత మూడేళ్ళలో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి తగిన వనరుల్ని సమీకరించుకుని, అంతర్జాతీయస్థాయి నిపుణుల‌తో ఈ నగర నిర్మాణానికి ఆకృతుల రూపకల్పన చేయిస్తున్నారని అంటున్నారు. 2019 నాటికి అమరావతి నగరానికో రూపురేఖలు తేవడం ఇప్పుడు చంద్రబాబు ప్రధాన లక్ష్యం. అది జ‌రిగిన‌పుడే క‌లిగిన నష్టాన్ని మించి తమకు చంద్రబాబు ప్రయోజనాలు చేకూర్చగలరన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇక బాబు విమ‌ర్శ‌కులు మాత్రం త‌మ విశ్లేష‌ణలో ప‌లు కోణాలు స్పృశించారు. అంతర్జాతీయ అసెంబ్లీ అని ఊదరగొట్టిన సచివాలయంలో ఏడాది కూడా గడవకుండానే ప్రతిపక్ష నాయకుడి ఆఫీసులో బక్కెట్లతో ఎత్తి పోసినట్టు జోరున వాన కురవడం..  రికార్డు కాలంలో పూర్తిచేశామని చెప్పుకుంటున్న పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 199 కోట్ల భారీ అవినీతి జరిగిందని కాగ్‌ తేల్చేయడం - అవినీతిలో ఏపీని నెంబర్‌ వన్ అని తేల‌డం - గోదావరి పుష్కరాల్లో 30 మంది విగతజీవులుగా మారిపోవడం..లాంటివన్నీ నవ్యాంధ్రకు మాయ‌ని వ‌చ్చ అంటున్నారు.

- చంద్రబాబు ఎన్నికల్లో ఏవైతే హామీలిచ్చారో వాటిలో కీల‌క‌మైన‌వి అలా ముగిసిపోయాయి - మురిగిపోతున్నాయని చెప్తున్నారు. రైతు రుణమాఫీ - డ్వాక్రా రుణాల మాఫీ - నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేస్తానని చెప్పిన బాబు ఏ మేరకు చేశారో గ్రామాలకెళ్లి ఎవర్నడిగినా తమకు జరిగిన అన్యాయం ఏకరువు పెడతారు. లేక లేక ఇచ్చిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ప్రణాళిక లేకపోవడంతో అభ్యర్థులు ధర్నాలు వాయిదా వేయించుకోవాల్సి వచ్చింది.

-అధికారంలోకి వస్తే బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బాబు లబ్ధిదారుల పేరుతో రైతులను అనర్హులుగా ప్రకటించారు. నామమాత్ర రుణమాఫీ పొందిన రైతులకు కూడా ఇచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోవడం లేదు. కౌలు రైతుల పరిస్థితి సరేసరి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇన్వెస్టమెంట్‌ ఫండ్‌ పేరుతో పదివేలు మూడు విడతలుగా ఇస్తున్నాడు.

-చంద్రబాబు విలాసవంత‌మైన బంగ్లా క‌ట్టుకుంటే .. పక్కా ఇంటి కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడు ఇప్పటికీ ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడని ప‌లువురు ఉద‌హ‌రిస్తున్నారు.
-పేద రాష్ట్రంలో ఉన్నాం.. ఖర్చులు తగ్గించుకోవాలని జనాలకు చెప్పే బాబు మాత్రం నాలుగైదు కిలోమీటర్లకు కూడా హెలికాఫ్టర్ లో తిరుగుతున్నార‌ని, రూ. 5 కోట్లతో ఇంటిని తలపించే బస్సును ఏర్పాటు చేసుకున్నార‌ని... అదే సామాన్యుడు ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి కూడా ఛార్జీలు అందుబాటులో ఉండవని ఆగ్ర‌హిస్తున్నారు.

-ఒకప్పుడు పేదోడికి సంజీవనిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆరోగ్య శ్రీ పథకం ఎందుకూ కొరకాకుండా పోయింది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వారు ఉచిత వైద్యానికి ముందుకు రావడం లేదు.
-ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న యువభేరిల జోరుకు బ్రేకులు వేయాలని చూసి నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌ లో ప్రవేశపెట్టిన రూ. 500 కోట్లకు ఇప్పటికీ విధివిధానాలు రూపొందించనేలేదు.

- జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన టీడీపీ తీరా అధికారంలోకి వచ్చాక ఎంతోమంది ఆరోగ్యమిత్రలను ఉద్యోగాల్లోంచి తీసేశారు. హాజరు పేరుతో 9 వేల పాఠశాలలకు తాళాలు సిద్ధంగా ఉన్నాయి. ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరించమని పోరాడుతూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో రూ. 2లకు 20 లీటర్ల మంచినీరు ఇస్తామన్న బాబు హామీ ఎన్ని చోట్ల అమలు చేస్తున్నారో పాలకుల‌కే ఎరుక‌.

-గత ప్రభుత్వం చేపట్టిన ఐదూ పది శాతం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయ తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. ముచ్చుమ్రరి - పైడిపాలెం ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90 శాతం పూర్తయినవై. పట్టిసీమ కాలువ పనులు కూడా ఏడెనిమిది కిమీలు మినహా అప్పుడు పూర్తి చేసిందేన‌నే అభిప్రాయం చాలా మందిలో ఉంది. 2013 చట్టం ప్రకారం వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి వున్నా అమలు అంతంత మాత్రంగానే ఉంది. పోలవరం, వంశధార నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా వారికి ఇప్పటికీ అందక దానికోసం పోరాడుతూనే ఉన్నారు. అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించేసి తెలుగు తమ్ముళ్లు ప్రజలపై పెత్తనం చేసేలా చట్టాలు మార్చారు.

- రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ర‌క్ష‌ణ లేని ప‌రిస్థితి ఉంద‌నేది అనేక‌మందిలో ఉన్న భావ‌న‌. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవ‌మానిస్తే విచారణ లేదు.  టీడీపీ నాయకులు ఆగడాలకు మాచర్ల జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీదేవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారు ఉన్నారు. బాపట్ల విజేతమ్మ, గుంటూరు జడ్పీచైర్‌ పర్సన్‌ జానీమూన్‌ వంటి వారు లోకేష్‌ కు చెప్పినా న్యాయం జరగడం లేదని మీడియా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ కొడుకు తప్పతాగి ఓ మహిళను వేధించినా అతనిపై చర్యలు లేవని ఇటీవ‌లే వార్త‌లు వ‌చ్చాయి.  ఇదంతా ఒక ఎత్తయితే సాక్ష్యాత్తు టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కూతురు డాక్టర్‌ మాధవీలత తనను మాజీ మంత్రి బొజ్జల అనుచరులు బెదిరించారని.. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించినా దిక్కులేదని మండిప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News