భారత్ లో టిక్ టాక్ బ్యాన్ ... నష్టం ఎన్ని కోట్లంటే ?

Update: 2020-07-02 10:19 GMT
భారత్ -చైనా సరిహద్దులో ఏర్పడిన ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో చైనాకి చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లను బ్యాన్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది. మరోవైపు గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశం తర్వాత చైనాపై మరోసారి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది.

దీంతో బాయ్‌ కాట్ చైనా అంటూ సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ యాప్‌ లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ మొత్తం యాప్స్‌ లలో ఎక్కువగా ఎఫెక్ట్‌ పడిన యాప్ ఏదంటే టిక్‌ టాక్‌ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో టిక్‌ టాక్‌ చేయని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నవారి నుంచి ముసలి వారి వరకూ టిక్‌టాక్‌ చేస్తూ పలువురు ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు భారత్‌ లో టిక్ ‌టాక్‌ నిషేధం విధించడంతో.. చైనా సంస్థ బైట్‌ డ్యాన్స్‌ కు రూ.45 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌ లో నిషేధం తర్వాత బైట్‌ డాన్స్‌ 6 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.45 వేల కోట్లు నష్టపోవచ్చని వెల్లడించింది.
Tags:    

Similar News