కంటికి కునుకు కరువైన ఇమ్రాన్.. పీడీఎం ర్యాలీలతో ఉక్కిరి బిక్కిరి

Update: 2020-10-26 14:30 GMT
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విపక్షాల నిరసన ప్రదర్శనలతో ఉక్కిరి బిక్కిరి  అవుతున్నాడు. తనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీలకు ప్రజా ఆదరణ పెరగడంతో ఆందోళన చెందుతున్నాడు. పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌(పీడీఎం) నిర్వహించే సమావేశానికి మిలిటెంట్ల  నుంచి ముప్పు ముందని పాకిస్తాన్‌ నేషనల్ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ హెచ్చరించినప్పటికీ పీడీఎం కూటమి నేతలు పట్టించుకోలేదు. భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎన్‌సీటీఎ చెప్పినట్టుగానే సమావేశం అనంతరం ఆ ప్రాంతంలో బాంబు పేలి ముగ్గురు పౌరులు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

పాకిస్థాన్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా గత నెల 20వ తేదీన  విపక్ష నేతలంతా కలిసి పీడీఎంను ఏర్పాటుచేశారు. ఈ కూటమి ఇమ్రాన్ ను పదవి నుంచి  దించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఇప్పటికే ఈ కూటమి లాహోర్,  కరాచీ నగరంలో రెండు భారీ ర్యాలీ నిర్వహించగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆదివారం బెలూచిస్తాన్  ప్రాంతంలోని క్వెట్టాలో మరో భారీ ర్యాలీ నిర్వహించారు. విపక్ష కూటమి నేతలు ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ప్రసంగించారు. పాకిస్థాన్ మిలటరీ రిగ్గింగ్ చేయడం వల్లే ఇమ్రాన్ ప్రధాని కాగలిగాడని విమర్శించారు. శాంతిభద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని ఇమ్రాన్ ను ఉద్దేశించి విమర్శించారు.

పీడీఎం అధ్యక్షుడు, జామియత్ ఈ ఇస్లాం నేత మౌలానా ఫజ్లర్ రహ్మాన్, లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన పాక్  మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ నుదుటి  రేఖ మార్చాల్సిన  సమయం ఆసన్నమైందన్నారు. పీఎంఎల్ -ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్  బెలూచిస్తాన్ ప్రజలపై  దాష్టికాలు ఏ మాత్రం సహించమన్నారు. కాగా పీడీఎం ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. తాను ప్రధాని కావడానికి మిలటరీ సాయపడింది చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
Tags:    

Similar News