దూకుడు పెంచిన అళగిరి..స్టాలిన్ కలవరం..

Update: 2018-09-10 08:15 GMT
తమిళనాడులోని రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి.. డీఎంకేలో మళ్లీ చేరడానికి సామ - దాన - భేద - దండోపాయాలు ప్రయోగిస్తున్న ఎం.కె. అళగిరి తాజాగా మరో ఎత్తుగడకు సిద్ధమయ్యారు.. స్టాలిన్ మెట్టు దిగకుంటే త్వరలో రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో డీఎంకేకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిసింది. తండ్రి మృతితో ఖాళీ అయిన తిరువారూర్ నియోజకవర్గంలో తానే రంగంలోకి దిగాలని.. కరుణానిధి కొడుకుగా ప్రజల ముందుకు వెళ్లడానికి అళగిరి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మృతితో ఆ పార్టీలోకి మళ్లీ చేరడానికి ఎంకె.అళగిరి పలు ప్రయత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే..

సమయం వచ్చినప్పుడు చెబుతా అంటూ మొదట్లొ డీఎంకేకు హెచ్చరిక సంకేతాలు పంపినా ఆ తర్వాత స్టాలిన్ నాయకత్వాన్ని స్వీకరించడానికి సిద్ధమేనంటూ అళగిరి రాజీ ధోరణి అవలంభించారు. ఈ నెల 5న భారీ స్థాయిలో కరుణానిధి సమాధి వద్దకు ర్యాలీ నిర్వహించి తన సత్తా చాటినప్పటికీ అళగిరి సిద్ధమయ్యాడు. ఇప్పుడు తాజాగా స్టాలిన్ ను  మెట్టు  దించడానికి అళగిరి మరో ఎత్తుగడకు సిద్ధమయ్యారు. జోన్ మృతితో ఖాళీ అయిన తిరుప్పరుకుండ్రం - కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువారూర్ శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి డీఎంకేకు గట్టి గుణపాఠం చెప్పాలని అళగిరి నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో తిరువారూర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయనే రంగంలోకి దిగాలని నిర్ణయించారని, దీనిపై తన మద్దతుదారులతో సమాలోచనలు సైతం నిర్వహిస్తున్నట్లు సమాచారం..

తిరువారూర్ నియోజకవర్గంలో డీఎంకే కన్నా కరుణానిధి కుటుంబానికి వచ్చే ఓట్లే కీలకం.. ఉదయ సూర్యుడు గుర్తు కన్నా కరుణానిధి ముఖచిత్రం కోసమే ఓట్లు వేసేవారు ఎక్కువ మంది ఉండడంతో ఇక్కడ తనకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని అళగిరి భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే కరుణానిధి కుమారుడు అనే సానుభూతితో డీఎంకే అభ్యర్థిని ఓడించవచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 డీఎంకే నుంచి ఉద్వాసనకు గురై నాలుగేళ్లపాటు పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ చైన్నైలో ర్యాలీ ద్వారా తన సత్తా ఏమిటో అళగిరి చూపారు. ఇది డీఎంకేలోని పలువురు సీనియర్ నేతలను ఆలోచనల్లో పడేసింది. దీంతో అళగిరికి దగ్గర కావడానికి వారంతా ప్రయత్రిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఓ సీనియర్ నేత అళగిరితో సంప్రదింపులు జరిపారని, ఆయనకు పలు సూచనలు ఇచ్చారని సమాచారం.. మరురైలో ఉండి సమాలోచనలు నిర్వహించడం కన్నా జిల్లాలవారీగా పర్యటించడం మేలని.. అప్పుడే అధిష్ఠానంపై అసంతృప్తిలో ఉన్న జిల్లా స్థాయి నిర్వాహకులు నేరుగా కలిసి మాట్లాడే అవకాశం కలుగుతుందని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఇది తన బలాన్ని మరింత పెంచుకోవడానికి దోహదపడనుందని అళగిరి కూడా భావించారని, అందువల్ల తిరువళ్లూరు జిల్లా నుంచి తన తొలి పర్యటన ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం..ఇది డీఎంకే అధినేత స్టాలిన్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.
Tags:    

Similar News