కేసీఆర్ కు భయపడడం లేదు.. హీరో సంచలనం

Update: 2019-04-26 06:22 GMT
కేసీఆర్ ఓ పులి.. ఓ సింహమో కాదు.. కదా.. ఆయనా మనలాగా మనిషే.. మరి ఎందుకు భయపడుతున్నారు.? కేసీఆర్ పేరు చెబితే చాలు.. భయంతో కూడిన వణుకు వల్ల వచ్చిన వినయాన్ని టాలీవుడ్ ప్రముఖులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మొన్నటి వరకు ఏ మీడియా చూసినా.. సోషల్ మీడియా చూసినా ఇవే ప్రశ్నలు..

తెలంగాణలో ఇంటర్ మీడియట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడం.. ఇంటర్ బోర్డ్ వైఫల్యం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం.. ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంఘాలు బోర్డు ఆఫీస్ ఎదుట ఆందోళన చేయడంతో ఈవిషయం పతాకశీర్షిక అయ్యింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలూ గవర్నర్ ను కలిసి కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు.

అయితే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కొందరు టాలీవుడ్ ప్రముఖులు కర్రవిరగకుండా పాము చావకుండా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. అందులో ఒక్క పదాన్ని కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా వాడలేదు. దీన్ని బేస్ చేసుకొని మీడియా, సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రెటీలు కేసీఆర్ కు భయపడుతున్నారని నెటిజన్లు ఏకిపారేశారు. ట్రోలింగ్ లు చేశారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ అంటే తమకు భయం లేదని క్లారిటీ ఇచ్చాడు మంచు హీరో విష్ణు. సినిమా వాళ్లు కేసీఆర్ అంటే భయపడుతున్నారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని విష్ణు క్లారిటీ ఇచ్చారు. కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని.. భవిష్యత్ లో మళ్లీ తప్పు జరగకుండా చూసుకోవాలని విష్ణు సూచించారు. ఇప్పుడు అదే ముఖ్యమని వివరించారు.

తనకు కేటీఆర్ తెలుసునని.. ఆయన చురుకైన, సమస్యలపై వేగంగా స్పందించే నాయకుడని.. కేసీఆర్ ఫైర్ బ్రాండ్ అనే విషయం కాదనడం లేదని విష్ణు చెప్పుకొచ్చారు. కానీ అందరూ అన్నట్టు కేసీఆర్ నియంత మాత్రం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే.. అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఒక తప్పు జరగడం వల్ల విద్యార్థులు మృతిచెందారని.. వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలుపుతున్నానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే విమర్శించాలని.. కానీ అలాంటి పరిస్థితులు నాకైతే కనిపించడం లేదని వివరణ ఇచ్చారు.
    
    
    

Tags:    

Similar News