టాప్ 5: ఏపీలో భారీగా ఖర్చు ఆ అసెంబ్లీ సీట్లలోనే?

Update: 2019-04-23 19:30 GMT
ఎన్నికల్లో ఖర్చు భారీగా పెరిగిపోయిందని రాజకీయ పార్టీల నేతలే వాపోతున్నారు! ఈ విషయంలో పరిశీలకులు - సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేయడం కాదు.. ఏకంగా రాజకీయ పార్టీల నేతలే ఈ విషయంలో తమ ఆందోళన  వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖర్చులు భారీగా పెట్టాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అలా ఖర్చులు పెట్టడమే నియమాలకు విరుద్ధం. అలాంటిది వారే ఓపెన్ గా అలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి నేపథ్యంలో పోలింగ్ పూర్తి అయిపోయి, ఫలితాల కోసం వేచి చూస్తున్న ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన డబ్బు పంపిణీల గురించి కూడా ఆసక్తిదాయకమైన చర్చ సాగుతూ ఉంది.

అందులో భాగంగా ఏపీలో అత్యధిక స్థాయిలో ఖర్చు అయిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో టాఫ్ ఫైవ్ ఇలా ఉంటుందని అంచనా!

మంగళగిరి..

ఫలితాల విషయంలో బాగా ఆసక్తిని రేపుతున్న నియోజకవర్గం ఇదే. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీలో ఉండటమే అందుకు కారణం. ఇక ఖర్చు విషయంలో కూడా ఈ నియోజకవర్గం టాప్ పొజిషనే ఆక్రమించిందని టాక్. విజయం కోసం ఇరు వర్గాలూ గట్టిగా పోరాడాయి. అందులో భాగంగా ఇరువర్గాలూ భారీగా ఖర్చు పెట్టుకున్నట్టుగా భోగట్టా. ఏసీ లు - ఫ్రిడ్జ్ లు ఓటర్లకు బహుమానాలుగా ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చు కనీసం రెండు వందల కోట్ల రూపాయల వరకూ అయ్యుంటనేది ఒక అంచనా!

నెల్లూరు అర్బన్..

మంత్రి నారాయణ పోటీ చేసిన నియోజకవర్గం ఇది. అత్యంత భారీగా అభ్యర్థులు ఖర్చు పెట్టుకున్న నియోజకవర్గాల్లో ఇది నంబర్ టు అవుతుందని అంటున్నారు. నారాయణ మల్టీ మిలియనీర్. ఈ నియోజకవర్గలో ఖర్చులు అత్యంత భారీగా నమోదయ్యాయని స్థానికులు అంటున్నారు. మహిళా ఓటర్లను వెండి కుంకుమ భరణిలతో ఆకట్టుకునే ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది. అక్కడితో మొదలు.. నెల్లూరు అర్బన్ ఖర్చు విషయంలో వాగిపోయిందని అంటున్నారు.

అద్దంకి..

ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు విజయం ప్రతిష్టాత్మకం. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. దీంతో విజయం ఆయనకు ప్రతిష్టాత్మకం అయ్యింది. దీంతో ఈ నియోజకవర్గంలోనూ అత్యంత భారీగా ఖర్చు అయ్యిందని అంచనా.

గుడివాడ..

కృష్ణా జిల్లాలోని ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పరిస్థితి ఉంటుందని మొదటి నుంచి అంచనాలున్నాయి. అయితే ఆ ఆంచనాలతో పని లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడిందని సమాచారం. విచ్చలవిడిగా ఖర్చు అయిన నియోజకవర్గంలో ఇది కూడా ఒకటని పరిశీలకులు అంటున్నారు. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే ప్రయత్నంలో భారీగా ఖర్చు పెట్టారని సమాచారం.

విశాఖ నార్త్..

మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఆయన ప్రచారం సరిగా చేయలేదు అనేది ఒక టాక్. గంటా ఈ సారి గట్టిగా శ్రమించలేదని అంటున్నారు. అయితే ఖర్చు విషయంలో మాత్రం తిరుగేలేదు అని, రాష్ట్రంలోనే అత్యంత భారీ స్థాయిలో ఎన్నికల ఖర్చు అయిన నియోజకవర్గాల్లో విశాఖ నార్త్ కూడా టాప్ ఫైవ్ లో చోటు సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News