అమిత్ షా కొడుకు సేవలో తరిస్తున్న భాజపా!

Update: 2017-10-12 04:42 GMT
ఇసుమంతైనా తేడా కనిపించడం లేదు. అచ్చంగా కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తిపూజా సంస్కృతులే భారతీయ జనతా పార్టీలో కూడా కనిపిస్తున్నాయి. సిద్ధాంతాలు, విలువల సంగతి ఇప్పుడు ఆ పార్టీలో పెద్దలకు ఎవ్వరికీ గుర్తున్నట్లు లేదు. పార్టీలో ఎవరి హవా నడుస్తోంటే.. వారి భజనలో తరించిపనోవడం గురించే అందరూ తపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ షా కు చెందిన కంపెనీల టర్నోవర్ 16వేల రెట్లు పెరిగిన వ్యవహారం ప్రకంపనాలు సాగుతున్నాయి. జయ్ షాను సమర్థించడానికి , తద్వారా అమిత్ షా గుడ్ లుక్స్ లో పడడానికి పార్టీ సీనియర్ నాయకులంతా పోటీ పడుతున్నారంటే పరిస్థితి ఎలా మారుతోందో అర్థం చేసుకోవచ్చు.

భాజపా లోని కేంద్రమంత్రులు - ఇతర సీనియర్ నాయకులు పార్టీకి ఏమాత్రం సంబంధం లేని ప్రెవేటు వ్యక్తి జే షా వ్యాపారంపై వచ్చిన పుకార్ల గురించి స్పందించడాన్ని పార్టీ మాజీ సీనియర్లు తప్పు పడుతున్నారు. మోదీ సర్కారు నోట్ల రద్దు  - జీఎస్టీ ల గురించి అవి ప్రజాకంటక నిర్ణయాలని తన అభిప్రాయం వెల్లడించి సంచలనం సృష్టించిన మాజీ భాజపా కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ తాజా పరిణామాలపై కూడా విరుచుకుపడుతున్నారు. అమిత్ షా కొడుకు ఒక ప్రెవేటు వ్యక్తి అని - పార్టీతో సంబంధం లేని ఆయనపై ఆరోపణల గురించి పార్టీలోని ప్రభుత్వపు పెద్దలు కేంద్రమంత్రులు వకాల్తా పుచ్చుకోవడం తగదని అంటున్నారే. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ - జే షాకు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇది సరికాదని ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యశ్వంత్ అంటున్నారు.

అదే సమయంలో ప్రభుత్వ అటార్నీ జనరల్ ను ఒక ప్రెవేటు వ్యక్తికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసును వాదించడానికి అనుమతించడం కూడా తప్పేనని ఆయన అంటున్నారు. ఇలాంటి సంఘటన చరిత్రలో ఎన్నడూ జరగలేదని కూడా క్లారిటీ ఇస్తున్నారు. జేషా వేసిన వంద కోట్ల పరువునష్టం దావా వాదించడానికి కేంద్ర సహాయ అటార్నీ జనరల్ కేంద్రం అనుమతి తీసుకున్నారు.

అయితే జే షా అవినీతికి పాల్పడ్డారా లేదా అనే సంగతి నిదానంగా తేలుతుంది. ఆయన కంపెనీ టర్నోవర్ పెరగడంలో అవినీతి జరిగి ఉండకపోవచ్చు కూడా. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని పక్కన పెట్టిచూసినా..  భాజపాలో అధికారం హవా ఉన్నవారి అనుగ్రహం కోసం నాయకులంతా పోటీ పడి సాగిలపడే వైఖరి మొదలైందనే సత్యం మాత్రం ఈ ఎపిసోడ్ తో బయటపడుతోంది.
Tags:    

Similar News