ఆండ్రూ లోనీ లాంటోళ్లు ప్రపంచంలో ఉంటేనే నిజాలు బయటకొచ్చేవి

Update: 2022-05-01 09:38 GMT
'ఆండ్రూ లోని' పేరు విన్నారా? అంటే తెల్లముఖం వేసే వారే ఎక్కువగా కనిపిస్తారు. ఒకవేళ.. ఆయన పేరు ముందు చరిత్రకారుడన్న మాటను తగిలిస్తే ఆయన్ను కొంతమంది గుర్తుకు తెచ్చుకునే వీలుంది. ఎవరు ఇతను? ఎందుకింత బిల్డప్? అని అనుకోవచ్చు. భవిష్యత్ తరాలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో తన కోట్లాది ఆస్తుల్ని కేసుల కోసం పోరాడే ఇతని తీరు చాలా అరుదుగా చెప్పక తప్పదు. ఇలాంటోళ్లు ప్రపంచంలో మరికొంతమంది ఉంటే.. దశాబ్దాలు.. శతాబ్దాలు తరబడి కప్పేసి ఉన్న రహస్యాల్ని సైతం బయటకు తెచ్చే సత్తా ఇతని సొంతం.

భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు.. భారత చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ లకు చెందిన వ్యక్తిగత లేఖల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తున్న వారిలో కీలకం ఆండ్రూ లోనీ. నిజానికి ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన చాలా అంశాలు బయటకు వచ్చినా.. రావాల్సినవి చాలానే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు సౌథాంప్టన్ వర్సిటీ వద్ద ఉన్నాయి. వాటిలోని సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నది 'ఆండ్రూ' ఆశ. అందుకోసమే ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఎడ్వినా మౌంట్‌బాటన్‌ల నడుమ సాగిన వ్యక్తిగత లేఖలను బహిర్గతం చేయాలన్నదే ఆయన అభ్యర్థ. దీని వల్ల జరిగే ప్రయోజనం ఏమిటంటే ఆయన వాదన ఏమంటే.. 'ఈ లేఖలు రావటం వల్ల వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. భవిష్యత్తులో చరిత్రకారులకు ఉపయోగం ఉంటుంది' అని చెబుతారు.

ప్రస్తుతం వీరిద్దరి మధ్య సాగిన వ్యక్తిగత లేఖలు..డైరీలు.. సౌథాంప్టన్‌ విశ్వవిద్యాలయంలో దాచి ఉంచారు. అయితే.. వర్సిటీకి వీటిపై యాజమాన్యం హక్కులు ఉండవని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో.. ఇందులోని పూర్తి వివరాల్ని బహిరంగ పరిచేందుకు ట్రైబ్యునల్ ఇష్టపడలేదు. అయితే.. ఇందులోని చాలా విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయని పేర్కొంటూ.. మిగిలిన వాటిని బయటపర్చకూడదని పేర్కొన్నారు.

ట్రైబ్యునల్ నిర్ణయంపై ఆండ్రూ లోనీ కాస్తంత నిరాశకు గురవుతున్నారు.దీనికి కారణం.. ఈ వివరాలు బయటకు వస్తే చరిత్రకు సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా తెలుస్తాయన్నది ఆయన ఆశ. అయితే.. ఈ వివరాలుబయటకు వస్తే బ్రిటన్.. పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణిస్తాయన్నది కొందరి వాదన.

ఎందుకంటే.. ఈ పత్రాల్లో పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మీద ఎడ్వినా చేసిన విమర్శలే కారణమని చెబుతారు. జిన్నాను మానసిక రోగిగా ఆమె తన డైరీలో రాసుకున్నట్లు చెబుతారు. బయటకు రాని లేఖలు.. డైరీల కోసం ఇప్పటివరకు ఆయన రూ.2.88 కోట్లను ఖర్చు చేశారు. తన వృద్ధాప్యం కోసం దాచుకున్న సేవింగ్స్ ను ఖర్చు చేసేశారు.

ఇంకా ఆయన రూ.48లక్షల వరకు బాకీ ఉన్నట్లు చెబుతారు. ప్రపంచానికి కొన్ని నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో తన ఆస్తి మొత్తాన్ని పణంగా పెట్టేటోళ్లు ఎంతమంది ఉంటారో చెప్పండి? త్వరలో ఆండ్రూ రాసిన కొత్త పుస్తకం.. "ట్రైటర్‌ కింగ్‌: ది స్కాండలస్‌ ఎక్సైల్‌ ఆఫ్‌ ద డ్యూక్‌ అండ్‌ డచెన్‌ ఆఫ్‌ విండ్సర్‌" 'మే'లో విడుదల అవుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News