కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తన చివరాకరి బడ్జెట్టు ప్రవేశపెట్టింది. ఇది కచ్చితంగా ఓట్ల బడ్జెట్ అని దేశానికి తేలిపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పెట్టుబడి పథకం రైతు బందు ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆమోదముద్ర పొందుతాయని మరోసారి రుజువైంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అని వివిధ సర్వేలు చెబుతున్నాయి. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. దీంతో కేంద్రంలో ఏ పార్టీ లేదు ఏ కూటమి అధికారంలోకి రావాలన్న తెలుగు రాష్ట్రాల హవా తప్పకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలలో మజ్లిస్ పార్టీ ఒకటి కైవసం చేసుకోవడం ఖాయం. ఇక మిగిలిన 16 స్థానాల్లో ను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నల్లేరు మీద నడక గా కనిపిస్తోంది. అంటే తెలంగాణలో 17 స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితి చేతుల్లో ఉన్నట్టేఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 స్థానాల్లో ను తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది అంటున్నారు. ఒకవేళ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు స్థానాలు తగ్గిన ఇరవై రెండు స్థానాలు వరకు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో 17 స్థానాలు - ఆంధ్రప్రదేశ్ లో 22 స్థానాలు కలుపుకుని మొత్తం 39 నుంచి 40 స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీ - లేదూ ఇతర ప్రాంతీయ పార్టీలన్ని కలసినా.... ఈ రెండు పార్టీల మద్దతు కీలకం కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరివైపు మొగ్గు చూపితే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు జాతీయ స్దాయిలో మద్దతు లభించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.