తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మహబూబాబాద్ లో మూడో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ - మహిళా కలెక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. దీనిపై ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌లు సీఎంను కలిసి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బీజేపీ నాయకుడిని ఒకరిని బెదిరించడం సంచలనం రేపింది. గణేష్ మండపానికి డీజే అనుమతి విషయంలో తనను బద్ నాం చేయాలని చూస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యే స్థానికుడి ఒకరిని బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కొనసాగింపు అన్నట్లుగా టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ దౌర్జన్యానికి పాల్పడ్డారు.
తన ఫ్లాట్ లో ఉంటున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ రెండేళ్లుగా ఫ్లాట్ ఖాళీ చేయమన్నా స్పందించడం లేదని...ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లిచడంలేదని ఎన్ ఆర్ ఐ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దె ఇవ్వాలని అడిగినందుకే తనపై చెప్పుతో దాడి చేశారని వాపోయింది. అధికార పార్టీ నాయకుడిగా తనను ఎవరేమీ చేయలేరని ఎమ్మెల్సీ వ్యవహరిస్తున్నారని పేర్కొంది. అందుకే తన నివాసం ఖాళీ చేయించాలని, అద్దె చెల్లించాలని కోరుతూ ఇంటి అద్దె చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. నాంపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.