ఆటా సభల వేళ ఎమ్మెల్సీ కవితకు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకు వచ్చారు?

Update: 2022-07-03 10:37 GMT
గతానికి భిన్నంగా.. కాస్తంత కచ్ఛితంగా చెప్పాలంటే పాతికేళ్ల నుంచి విదేశాలకు వెళ్లే తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది. మరింత సరిగ్గా చెప్పాలంటే ఈ ప్రక్రియ 1997 నుంచి మొదలై 2003 నాటికి పీక్స్ కు చేరుకుంది. అప్పటికే ఊరికి పది మంది చొప్పున విదేశాలకు వెళ్లే పరిస్థితి. 2003-2009కి వచ్చేసరికి ప్రతి ఊళ్లో.. వీధికి పది మంది తెలుగువారు విదేశాల్లో ఉంటున్న పరిస్థితి వచ్చింది. విదేశాలకు వెళ్లే వారిలో మొదటి చాయిస్ అమెరికా అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పుణ్యమా అని ఐటీ  బూమ్ ను పట్టుకోవటంతో తెలుగు వారు సక్సెస్ అయ్యారు.

అమెరికాలో పెరిగిపోతున్న తెలుగువారికి తగ్గట్లే.. వారికి సంబంధించిన అసోసియేషన్లు అంతకంతకూ పెరగటం మొదలైంది. మొదట్లో తానా ఒక్కటే ఉండేది. పెరిగిన తెలుగువారితో ప్రాంతాల వారీగా.. కులాల వారీగా చీలిక ఏర్పడింది. దీంతో.. అమెరికాలో తెలుగువారికి సంబంధించిన వేదికలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆటా. అమెరికన్ తెలుగు అసోసియేషన్ గా సుపరిచితమైన ఈ సంస్థకు సరికొత్తగా అభివర్ణించారు ఎమ్మెల్సీ కవిత.

వాషింగ్టన్ డీసీలో ఆటా 17వ మహాసభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు. ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ గా ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలోతెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారని.. తెలంగాణ వారికి దేశంలో కేసీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందన్నారు. మహా సభల ద్వారా తెలుగు సంస్కృతిని భవిష్యత్ తరాలకు చెప్పేందుకు ఆటా కృషి చేశారని ప్రశంసించారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. అమెరికాలో ఉన్న వేర్వేరు సంఘాలన్ని ఒకే వేదిక మీద ఉండటంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఒక్క నేత కూడా ప్రయత్నించకపోవటం కనిపిస్తుంది. ఎవరికి వారు.. వారికి చెందిన వారిని ఆహ్వానించటం.. అందుకు బదులుగా వారి సంఘాన్ని ఆకాశానికి ఎత్తేసేలా నేతలు మాట్లాడటమే తప్పించి.. దేశం కాని దేశంలో వేర్వేరు సంఘాల పేరుతో చీలిపోయే కన్నా.. తెలుగు వారంతా ఒక్కచోటే బలంగా ఉంటే మరింత బాగుంటుందన్న మాట తెలుగు నేతల నోటి నుంచి ఎందుకు రాదన్నది అసలు ప్రశ్న. ఏమైనా.. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఎన్టీ రామారావు గుర్తుకు రావటం విశేషంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News