కామ్రేడ్ యాత్రకు కవితక్క కంగ్రాట్స్ చెప్పారట!

Update: 2016-10-13 05:10 GMT
ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. ఇలాంటివి కమ్యూనిస్టులకు చాలానే తెలుసు. ఇప్పుడైతే వారి హవా కాస్త తగ్గింది కానీ.. గతంలో వారి సత్తా ఏమిటో రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి తెలిసిందే. ప్రజల్లో కలిసి పోయి.. ప్రజాగ్రహంతో ప్రభుత్వాలకు నూకలు చెల్లేలా చేయటంలో కామ్రేడ్స్ టాలెంట్ అంతా ఇంతా కాదు. మారిన పరిస్థితులకు తగ్గట్లుగా వారి మైండ్ సెట్ మారకపోవటం.. తరచూ చేసిన తప్పుల పుణ్యమా అని వారి పరపతి తగ్గిన దుస్థితి. అయితే.. పోయిన చోటనే వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారు.. ఇప్పుడు మళ్లీ తమ పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట్నించి వ్యతిరేకించి.. చివరకు బిల్లు పాస్ అయ్యే సమయంలోనూ తమ వైఖరిని మార్చుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది సీపీఎం ఒక్కటి మాత్రమే. అలాంటి పార్టీ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో భారీ పాదయాత్రకు తెర తీసింది.

అక్టోబరు 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 12 వరకు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహా పాదయాత్రను నిర్వహించాలని డిసైడ్ చేశారు. సామాజిక న్యాయం.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వీలుగా తమ్మినేని భారీ మహాపాదయాత్రను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇలాంటి వాటితో ప్రభుత్వానికి వచ్చే తలనొప్పులు తెలిసిన కేసీఆర్.. ఈ మధ్యన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ.. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతుందన్న సూటి ప్రశ్నను వేయటమే కాదు.. వారిని అడ్డుకోవాలంటూ బాహాటంగానే పిలుపునిచ్చేశారు. పాదయాత్ర అంటూ ఊళ్లలోకి వస్తున్న వారి చేత ముక్క నేలకు రాయించాలని.. తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు అడ్డు పడిందీ నిలదీయాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏ మాత్రం బలం లేని సీపీఎం పాదయాత్ర గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించిన తీరు చూస్తేనే.. కమ్యూనిస్టులతో ఎంత ఇబ్బందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కేసీఆర్ మాటకు తాజాగా తమ్మినేని కౌంటర్ ఇచ్చారు. ముల్లును ముల్లుతోనే తీసే సిద్ధాంతాన్ని అమలు చేస్తూ.. తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించిన వెంటనే.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత తనకు ఫోన్ చేసి అభినందించారన్నారు. తన పాదయాత్ర సక్సెస్ కావాలని కవిత ఆకాంక్షించారని.. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారంటూ తమ్మినేని వీరభద్రం ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ కు ఎదురుగా ఆయన కుమార్తె కవితను తీసుకొచ్చిన వీరభద్రం.. మరింత చతురతతో ఇంకో మాట కూడా చెప్పేశారు. తాను నిర్వహించనున్న తెలంగాణ మహాజన పాదయాత్రకు టీఆర్ ఎస్ నాయకులంతా మద్దతు తెలుపుతున్నారని.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కించపరిచేలా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. తమ్మినేని కారణంగా.. కవితక్కకు కేసీఆర్ క్లాస్ తప్పదా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News