లోక్ సభలో కేసీఆర్ డప్పు కొట్టిన గులాబీ ఎంపీ

Update: 2020-02-05 04:50 GMT
మనకేమాత్రం బలం లేని చోట.. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం మామూలు విషయం కాదు. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎంపీ ఒకరు చేసిన పని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్ సభలో టీఆర్ ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి తమ అధినేత కేసీఆర్ పాలన గురించి.. ఆయన తీసుకొచ్చిన పథకాల గురించి గొప్పలు చెప్పుకొచ్చారు. అంతేనా.. బీజేపీకి బలమున్న లోక్ సభలో.. మోడీ సర్కారు తమ ప్రభుత్వ పథకాల్ని కాపీ కొట్టిందన్న విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసిన ఆయన మాటలు ఇప్పుడు అందరి చూపు ఆయన పడేలా చేశాయి.

లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రసంగించిన ఆయన.. అనేక సంక్షేమ పథకాల్ని చేపట్టిన తెలంగాణ గురించి రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవటం ఏమిటి? అని ప్రశ్నించిన ఆయన.. మోడీ సర్కారుపై విమర్శల్ని సంధించారు.

రాష్ట్రానికి కేంద్రం సహకరించటం లేదని.. వాటాల్లో కోతలు పెడుతున్నారని.. దీని కారణంగా తెలంగాణకు రూ.2400 కోట్లు నష్టం వచ్చినట్లు చెప్పారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో భూగర్భ జలాలు రెండు అడుగులు పెరిగినట్లుగా చెప్పారు. ఇలా సారు పాలనలో తెలంగాణ ఎంతలా డెవలప్ అయ్యిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. మరే గులాబీ ఎంపీ చేయని పనిని రంజిత్ రెడ్డి చేశారని చెప్పాలి. లోక్ సభలో గులాబీ సారు డప్పు కొట్టటంలో తనకు మించినోళ్లు లేరన్న విషయాన్ని తాజా స్పీచ్ తో స్పష్టం చేశారు. అధినేత ఇమేజ్ ను ఎలా పెంచాలో రంజిత్ ను చూసి నేర్చుకోవాలని రానున్న రోజుల్లో ఇతర ఎంపీలకు కేసీఆర్ చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో?
Tags:    

Similar News