బాబుకు రిటర్న్ గిఫ్ట్ పై కేసీఆర్ యూటర్న్.?

Update: 2019-02-15 08:36 GMT
ఏపీ రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు. ఇటీవల టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఏపీలో పర్యటిస్తుండడం.. కేటీఆర్ జగన్ తో భేటి కావడం తదితర పరిణామాలు ఆసక్తి రేపాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా టీఆర్ ఎస్ ఏపీపై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడైన కరీంనగర్ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వినోద్ కుమార్.. ఏపీ అసెంబ్లీ - లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీఆర్ ఎస్ మద్దతు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. వైసీపీకి సొంతంగా తగినంత ప్రజాదరణ ఉందని చెప్పారు. టీఆర్ ఎస్ పార్టీకి ఏపీలో కార్యకర్తలు - నాయకుల బలం లేదని.. కనీసం శాఖ కార్యాలయం కూడా లేదని... ఎలాంటి కార్యకలాపాలు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము మద్దతు ఇచ్చినా వైసీపీకి పెద్దగా మార్పు ఉండదని పేర్కొన్నారు.

ఇక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న విషయాన్ని వినోద్ ప్రస్తావించారు. చంద్రబాబు కు తప్పకుండా సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా రిటర్న్ గిఫ్ట్ అందిస్తాడని వినోద్ స్పష్టం చేశారు. కానీ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టమని స్పష్టం చేశారు. వేలు పెట్టకుండా రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇన్నాళ్లు బాబును ఓడించేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేసి ఇప్పుడు టీఆర్ ఎస్ తన స్టాండ్ ను మార్చుకున్నట్టు వినోద్ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఇక టీఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉంటుందని.. ఫెడరల్ ఫ్రంట్ లో కొనసాగుతుందని.. తమతోపాటు బీజేడీ - వైసీపీ - బీఎస్పీ - ఎస్పీ  వస్తాయని వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాతే తమ స్టెప్ ఉంటుందని తెలిపారు.
Tags:    

Similar News