సభ్యత్వాల ద్వారా సారు పార్టీకి రూ.9.26కోట్లు

Update: 2015-03-16 18:33 GMT
   తెలంగాణ అధికారపక్షం సభ్యత్వ నమోదు కార్యక్రమం సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ వెల్లడించారు. కేవలం సభ్యత్వాల ద్వారా పార్టీకి రూ.9.26కోట్లు లభించినట్లు వెల్లడించారు.

తాజాగా నిర్వహించిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని 36 లక్షల మంది తీసుకున్నారని.. ఆన్‌లైన్‌లో సభ్యత్వం కోసం దాదాపుగా పావుగంట పడుతుందన్నారు.

వచ్చే నెల 24న ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని.. అదే రోజు పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారని వెల్లడించారు. ఆపై ఏప్రిల్‌ 27న పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ లోపు. గ్రామ.. మండల.. జిల్లా స్థాయి ఎన్నికల్ని నిర్వహిస్తామని వెల్లడించారు.

మరోవైపు.. ఏపీ సర్కారును ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సీమకు నీరు అందించే ఉద్దేశ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర అనుమతి తప్పనిసరి అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకూ ఉన్న పంచాయితీలు చాలవన్నట్లు తాజాగా ఏపీ నిర్మించే ప్రాజెక్టు విషయంలోనూ తమ అనుమతి తప్పనిసరి అని చెప్పటం ద్వారా కొత్త రచ్చకు కేసీఆర్‌ తెర తీశారని చెప్పాలి.

Tags:    

Similar News