లక్ష మెజారిటీ అనుకుంటే....లక్ష ఓట్లు వ్యతిరేకమా?

Update: 2020-11-11 13:10 GMT
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల పోరులో చివరకు బీజేపీని విజయం వరించింది. దాదాపు 1000 ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగిన ఈ పోటీలో తమ ఓటమికి గల కారణాలను టీఆర్ఎస్ విశ్లేషించుకుంటోంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు స్వయంగా ప్రచారం చేసినా ఎందుకు ఓడిపోయామన్న ప్రశ్న గులాబీ బాస్ కేసీఆర్ మదిలో మెదులుతోంది. అయితే, కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టు ....దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంలో హరీష్ కీలకపాత్ర పోషించారు. హరీష్ ప్రచారంలోకి దిగితే గెలుపు ఖాయమని కేసీఆర్ నమ్ముతారు. అటువంటిది దుబ్బాకలో ఓటమిని ఇటు కేసీఆర్...అటు హరీష్ జీర్ణించుకోలేక పోతున్నారట. దుబ్బాకలో హరీష్ ప్లాన్ వర్కవుట్ కాలేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. దుబ్బాకలో హరీష్ కాకుండా వేరేవాళ్ల పెత్తనం ఎక్కువయ్యిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక ఎన్నికలలో లక్ష మెజారిటీ వస్తుంది అని తన సర్వే చెబుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ స్టేట్ మెంట్ తో దుబ్బాక ఎన్నికలను చాలా మంది టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకున్నారు. గులాబీ బాస్ చెప్పాక గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమనుకొని ప్రచారంపై పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు. దీంతో, చాపకింద నీరులా బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేసి విజయం సాధించింది. బీజేపీ పుంజుకుంటోందని టీఆర్ఎస్ నేతలు గ్రహించిన తర్వాత ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. అయితే, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అభివృద్ధి సాధించలేకపోవడంపై బీజేపీ సోషల్ మీడియా గట్టిగా ప్రచారం చేసింది. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్యపై ఫోకస్ చేసిన బీజేపీ ఐటీ వింగ్ యూత్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. టీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించిన గుర్తు కూడా గులాబీ దళ ఓటమికి కారణమని అనుకుంటున్నారు. దుబ్బాకలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు నాగరాజుకు మొత్తం 3489 ఓట్లు వచ్చాయి. అతడికి ఎన్నికల్లో కేటాయించిన గుర్తు రొట్టెలు చేసే పీట. అయితే ఈ గుర్తు అచ్చం కారును పోలినట్టుగా ఉంటుంది. దీంతో, తమకు రావాల్సిన ఓట్లు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి పడ్డాయని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఆ అనుమానానికి తగ్గట్టుగానే దుబ్బాకలో పోటీ చేసిన స్వతంత్ర్య అభ్యర్థులందరిలోకి బండారు నాగరాజుకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమని అనుకుంటున్నారు. ఏది ఏమైనా...విజయంపై ధీమాగా ఉన్న కేసీఆర్...ఈ ఓటమితో పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. లక్ష మెజారిటీ అనుకుంటే....లక్ష ఓట్లు వ్యతిరేకమా? అన్న షాక్ లో టీఆర్ఎస్ శ్రేణులున్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News