ఎన్టీఆర్ మంత్రం.. కేసీఆర్ తంత్రం..

Update: 2018-10-01 11:33 GMT
సీఎం కేసీఆర్ 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజల మనసులను కొల్లగొట్టాడు.. ఇక 2014 ఎన్నికల్లో చుక్కాని లేని తెలంగాణకు తానో దిశను అవుతానని.. అభివృద్ధి మంత్రం జపించాడు. ఇప్పుడు ఏకంగా అభివృద్ధి చేసేశాడు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. ఇప్పుడు కేసీఆర్ నినాదం ఏంటి.? ప్రజల్లోకి ఏం చెప్పి వెళతాడనేది ప్రతిపక్షాలకు , టీఆర్ ఎస్ శ్రేణులకు కూడా అంతుచిక్కడం లేదట..

కేసీఆర్ కు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం.. ఆయన పిలుపుతో టీడీపీలో చేరారు. తన కొడుకుకు కల్వకుంట్ల తారకరామారావు అని పేరు కూడా పెట్టాడు. అలా చంద్రబాబును వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. అన్న నందమూరి తారక రామారావును మాత్రం ఒక్క మాట అనడం లేదు. ఇటీవలే ముందస్తు ఎన్నికల సందర్భంగా తాను ఎన్టీఆర్ కంటే మొగోడిని అనిపించుకోవాలని ఉందంటూ తన ఆశను వ్యక్తం చేశాడు.

తాజాగా ఆ ఎన్టీఆర్ నినాదాన్నే కేసీఆర్ ఈ ఎన్నికల్లో అవలంభించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ 80వ దశకంలో ‘తెలుగు వారి ఆత్మ గౌరవ’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడిపిస్తున్న కాంగ్రెస్ ను ఏపీలో గద్దెదించారు. ఇప్పుడదే సెంటిమెంట్  యాంగిల్ ను కేసీఆర్ బయటకు తీయబోతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడుస్తోందని.. ఇక్కడ వారు కనీసం ఒక్క నిర్ణయం తీసుకోలేరని.. సీటు నుంచి పదవులు దాకా ఢిల్లీ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని కేసీఆర్ ప్రచారం చేయబోతున్నట్టు తెలిసింది. ఇలా ‘తెలంగాణ ఆత్మ గౌరవ’ నినాదాన్ని బయటకు తీసి కాంగ్రెస్ ను ఓడించేందుకు సెంటిమెంట్ రగిల్చబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరి కేసీఆర్ తీస్తున్న ఈ అస్త్రానికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు పడతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే..
   

Tags:    

Similar News