ఆ టెంపుల్ లోకి ఆమె వెళ్లిపోయారు

Update: 2016-03-25 08:59 GMT
కొన్ని మత విశ్వాసాల పట్ల అంతులేని భయభక్తుల్ని ప్రదర్శించే సంఘాలు.. మరికొన్ని మత విశ్వాసాల విషయంలో తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించటం ఈ మధ్య తరచూ కనిపిస్తోంది. ఆ మత విశ్వాసాల్లో పస లేదని సవాలు చేయటమే కాదు.. తమ చుట్టూ ఉండే కోట్లాది మంది సెంటిమెంట్లను కాదని మరీ.. తమకు తోచినట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి పనే చేశారు భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్. హిందూ దేవాలయాల్లోని కొన్నింటిలో మహిళలకు ప్రవేశం ఉండదన్న సంగతి తెలిసిందే. అలాంటి వాటిని సవాలు చేస్తున్న ఆమె తాజాగా మహిళలకు అనుమతి లేని ఒక ఆలయంలోకి ప్రవేశించి.. తాను అనుకున్నది చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

మహారాష్ట్రలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన త్రయంబకేశ్వర్ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. కానీ.. తాము ఆ ఆలయంలోకి ప్రవేశించి.. పూజలు చేసినట్లుగా తృప్తి దేశాయ్ ప్రకటించారు. మహిలకు ఆలయాల్లో అనుమతి లభించేలా చూడాలంటే ఈశ్వరుడ్ని వేడుకున్నట్లు ఆమె వెల్లడించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవైపు మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేకపోవటంపై నిరసిస్తూ.. తృప్తి దేశాయ్ ఆలయంలోని ప్రవేశిస్తే.. ఆమె అలా ప్రవేశించటాన్ని స్థానికంగా ఉన్న మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఘటనను చూస్తే.. ఎవరి సెంటిమెంట్లకు విలువ ఇవ్వాలన్నది ప్రశ్నగా మారుతుంది. కొంతమంది అత్యుత్సాహం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే ధోరణిని ఏమనాలి? ఎలా చూడాలి? ఏది ఏమైనా దశాబ్దాల పర్యంతం మహిళలు ప్రవేశించని ఆలయంలోకి తృప్తి దేశాయ్ ప్రవేశించి.. తాను అనుకున్నది పూర్తి చేశారని చెప్పాలి.
Tags:    

Similar News