8 వేల పోస్టుల నోటిఫికేషన్ వెనక్కి వెళ్లింది

Update: 2017-03-03 05:04 GMT
ఈ మధ్యన వరాల మీద వరాలు కురిపిస్తూ.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ  చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా ఊహించని నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మధ్యనే 8 వేల గురుకుల టీచర్ల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయటం దానికి దరఖాస్తు చేయటానికి తుది గడువుగా మార్చి నాలుగును నిర్ణయించటం తెలిసిందే.

గడువు తేదీకి ఒక్క రోజు ముందు.. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ ను నిలుపు చేసినట్లుగా టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్ కు సంబంధించి కొన్నిఅంశాలపై కన్ఫ్యూజన్ పెరగటం.. అందరికి అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్ తోపాటు.. నిబంధనలకు తగ్గట్లుగా నోటిఫికేషన్ లేదన్న విమర్శల నేపథ్యంలో నోటిఫికేషన్ ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

గురుకులాల్లో పీజీటీ.. టీజీటీ పోస్టులకు అప్లై చేయటానికి డిగ్రీలో 60శాతం మార్కులు ఉండాలంటూ అభ్యర్థులకు పెట్టిన కటాఫ్ మార్కులు.. యాభై శాతానికి కుదించటంతో పాటు.. టీజీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులతో పాటు డీఎడ్ అభ్యర్థులకు సైతం అర్హత కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో.. అందరికి అవకాశం కల్పించేలా నోటిఫికేషన్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో కొత్త రూల్స్ ను తయారు చేయాలంటూ సోమేశ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే.. సోమేశ్ కమిటీ ఇప్పటివరకూ నివేదిక ఇవ్వలేదు. భారీగా పోస్టుల భర్తీ చేస్తున్న వేళ.. అందరికి ఆమోదయోగ్యమైన నోటిఫికేషన్ విడుదల చేయటం ద్వారా.. ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందన్న భావన పెరిగింది.

దీంతో.. ఆలోచనలో పడిన టీ సర్కారు.. ఎట్టకేలకు నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకొని.. సరికొత్త రూల్స్ తో మళ్లీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు. తాను అనుకున్నదే జరగాలన్నట్లు కాకుండా.. తెర మీదకు వస్తున్న అభ్యంతరాలపై తెలంగాణ సర్కారు స్పందిస్తున్న తీరు.. అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News