కేసీఆర్ లాంటోడు లేకనే.. ఆర్టీసీ సమ్మె నీరసిస్తోందా?

Update: 2019-10-10 05:48 GMT
తెలుగు నేల మీద ఇప్పటివరకూ ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఏ ఒక్కరు తీసుకోని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగాల్ని ఒక్క మాటతో తీసేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పాలి. నిజానికి ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని మరేవెరైనా ముఖ్యమంత్రి తీసుకొని ఉంటే.. కేసీఆర్ లాంటి నేత ఉరుకునేవారా? ఉద్యమాన్ని ఉరుకులు పరుగులు తీయటమే కాదు.. యావత్ తెలంగాణ స్తంభించిపోయేలా చేసేవారు.

మరి.. కేసీఆర్ కున్న టాలెంట్ మరెవరికీ లేదన్న విషయం తాజాగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో వారి వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా సంస్థ కోసం చేస్తున్నదే అన్నది నిజం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నినాదంతో మొదలెట్టిన సమ్మె అంతకంతకూ పెంచి పెద్దది చేయటమే కాదు.. తన మాటలతో కార్మికులకు అదే పనిగా షాకులు ఇవ్వటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ అవుతున్నారు.

48 వేల మంది ఉద్యోగాల్ని తీసేయటమే కాదు.. తాత్కాలిక సిబ్బందిని పెద్ద ఎత్తున రంగంలోకి దించటం ద్వారా సమ్మె ప్రభావం ప్రజల మీద లేకుండా చేయాలన్న కేసీఆర్ ప్లాన్ కు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల్ని ఎలా వినియోగిస్తే.. ఇష్యూ తన కంట్రోల్ కు వస్తుందన్న విషయంలో కేసీఆర్ పిచ్చ క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. ఐదు రోజులుగా సాగుతున్న సమ్మెను లీడ్ చేయటానికి అవసరమైన సత్తా ఉన్న వారెవరూ కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉన్నోళ్లు లేకపోవటం పెద్ద లోటుగా చెబుతున్నారు.

సమ్మె స్టార్ట్ అయిన నాటి నుంచి డిఫెన్స్ లో పడాల్సిన సీఎం.. అందుకు భిన్నంగా మరింత అగ్రెసివ్ గా మారటం ఆర్టీసీ ఉద్యోగుల్లో భయాందోళనకు గురి చేస్తోంది. ఉద్యమాన్ని టేకోవర్ చేసి.. ప్రభుత్వానికి చెమటలు పట్టేలా చేయటంలో రాజకీయ పార్టీలన్ని ఫెయిల్ అయిన వాదన వినిపిస్తోంది. ఉద్యమాలతో కేసీఆర్ ఎదిగిన రీతిలో.. మరో నేత ఎదగటానికి ఇప్పటికి మించిన అవకాశం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.

అలాంటప్పుడు ఈ ఇష్యూను టేకప్ చేసే చొరవ నేతల్లో లోపించిందని చెబుతున్నారు. విపక్షాలు ఇన్ని ఉన్నా.. వాటిని సమన్వయం చేసి.. ఒక చోటుకు తీసుకొచ్చి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జత కట్టే విషయంలో కనిపించని జంకు ఒకటి వారిని వెంటాడుతోందని చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సామాన్యుల్లో సానుకూలత ఉన్నా.. దాన్ని అందిపుచ్చుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేసి.. ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసే వ్యూహ చతురత లేకపోవటం పెద్ద లోపంగా చెబుతున్నారు.

ఉద్యమాల్ని నిర్మించటం.. అవసరానికి తగ్గట్లు హీట్ పెంచటం లాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని.. ఆయన ఒక్కరే పీస్ అని.. అలాంటోళ్లు తెలంగాణలో మరెవరూ లేరన్న విషయం తాజా ఎపిసోడ్ తో స్పష్టమైందంటున్నారు. కేసీఆర్ ఇంత స్థాయికి ఎదిగారంటే ఎంత సత్తా ఉంటే అన్న విషయం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News