టీటీడీ నిధులతో రాజకీయం.. చంద్రబాబుకు మరింత డ్యామేజీ?

Update: 2019-10-18 13:45 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా రకాల ధర్నాలు, దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నంత సేపూ  చంద్రబాబు నాయుడు ఒకరకమైన దీక్షలు చేశారు. అవన్నీ  నవనిర్మాణ దీక్ష లన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాకా  మరో రకమైన దీక్షలు చేశారు. అవన్నీ  బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ  చేసినవి!

ఏం చేసినా, ఎందుకు చేసినా.. అవన్నీ ప్రజల సొమ్ముతో చేసినవి. అలాగే తన రాజకీయం కోసం చేసినవి. తన రాజకీయ అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అనేక రకాల దీక్షలు చేస్తూ వచ్చారు. వాటితో రాజకీయంగా ఏదో లబ్ధి చేకూరుతుందని ఆయన భావించారు. అయితే అదేం కుదిరే పని కాదని ఎన్నికల ఫలితాలతో కానీ స్పష్టత రాలేదు.

ఆ సంగతలా ఉంటే.. ప్రజల సొమ్ముతో మాత్రమే  గాక, దేవుడి సొమ్ముతో కూడా దీక్షలు చేశారనేది చంద్రబాబు నాయుడి మీద గట్టిగా వినిపించిన ఆరోపణ. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేసిన దీక్షకు పూర్తిగా టీటీడీ నిధులు  వాడారనే అభియోగాలున్నాయి. ఆ విషయంలో అప్పటి నుంచినే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయం ఖాతాలోంచి నాలుగు కోట్ల రూపాయల నిధులను వాడారట. చంద్రబాబు ఢిల్లీ దీక్ష కోసం ఆ నిధులను హారతి కర్పూరం చేశారని ఆరోపణలున్నాయి.

ఈ విషయంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతూ ఉంది.  దేవుడి సొమ్మును ప్రభుత్వం అలాంటి అవసరాల కోసం వాడటం పూర్తిగా అనైతికం. అది భగవంతుడి మీద నమ్మకంతో ప్రజలు చెల్లించుకున్న మొక్కులు, కానుకలు. వాటితో రాజకీయం చేసే హక్కు, వాటిని రాజకీయ అవసరాల కోసం వాడే హక్కుఎవరికీ లేదు.

అలాంటి అనైతికమైన, చట్ట వ్యతిరేకం కూడా అయిన పనిని చంద్రబాబు నాయుడు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విజిలెన్స్  విచారణ ఒక కొలిక్కి వచ్చిందని, ఢిల్లీలోని టీటీడీ ఆధ్వర్యంలోని  నిధులు అలా చంద్రబాబు రాజకీయాలకు అనుగుణంగా వాడటం జరిగిందని నిర్ధారించారని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిదాయకమైన అంశం.
Tags:    

Similar News