పెద్ద‌నోట్లతో వెంక‌న్న‌కు ఝ‌ల‌క్‌...

Update: 2017-02-19 09:40 GMT
నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500 - 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు సెగ.. తిరుమల తిరుపతి దేవస్థానాని (టీటీడీ)కీ తగిలింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం.. టీటీడీ ఆదాయానికి గండి కొట్టింది. రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయలుగా ఉండే ఆదాయం.. నోట్ల రద్దు కారణంగా 2 కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది. అయితే  ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దుతో టీటీడీ రోజువారీ ఆదాయం భారీగా తగ్గిపోవ‌డంతో ఈ లోటును పూడ్చుకునేందుకు సేవలపై చార్జీల పెంపు రూపంలో భక్తులపై కొంత భారం మోపాలని దేవస్థానం భావిస్తోంది. దీంతో ఏడు కొండలవాడిని దర్శనంతోపాటు ఇతర సేవల చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది!

బ్యాంకు డిపాజిట్లపై వడ్డీతో కలుపుకొని టీటీడీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.5 కోట్ల వరకు ఉండేదని కానీ, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం చాలా రోజులపాటు గుడి రోజువారీ ఆదాయం సాధారణ స్థాయి కంటే రూ.1-2 కోట్ల మేర తగ్గిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆదాయ లోటును కొంతైనా పూడ్చుకునేందుకు దర్శనంతోపాటు ఇతర సేవల టిక్కెట్ చార్జీలను స్వల్పంగా పెంచాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటుందని తెలిపారు. కొద్దికాలం క్రితం దేవస్థానం బోర్డు.. టిక్కెట్లు - ప్రసాదం చార్జీలు పెంచాలని ప్రతిపాదించింది. కానీ అందుకు ఏపీ ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. దర్శన టిక్కెట్ ధరలు రూ.50 నుంచి రూ.500 వరకు ఉంటాయి. ఇందులో రూ.300 విలువ చేసే ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. ఇక వీఐపీ దర్శనం (రూ.500) టిక్కెట్లు రోజుకు 2 వేల వరకు అమ్ముడు కానున్నాయని అంచనా. సేవలను బట్టి టిక్కెట్ రేటును రూ.5-10 పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ఉన్నది తెలిసిందే. ఎస్‌ బీఐ సహా వివిధ జాతీయ బ్యాంకుల్లో భారీగా పసిడి డిపాజిట్లు టీటీడీకి ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News